- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కడికక్కడ నిలదీస్తాం.. ఎంపీలకు కేటీఆర్ హెచ్చరిక
బీసీ రిజర్వేషన్ల అంశంతోపాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నదని.. ఆ పార్టీని ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల అంశంతోపాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నదని.. ఆ పార్టీని ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్నారు. తెలంగాణలో ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని.. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు పెడుతామని చెప్పారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో అపోజిషన్ లీడర్‌గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే రాహుల్‌గాంధీ ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తరని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి నిజంగానే బీసీలపై, 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గళం ఎత్తాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. ఇక బడ్జెట్‌లో ఏటా బీసీలకు రూ.20వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్‌లో 20వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చేపట్టవలసిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు.
కేసీఆర్ వెంటే బీసీలు..
రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని అన్నారు. ముఖ్యంగా కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యారంగంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచుకున్నారని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకువెళ్తారని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. పార్టీ సీనియర్ నేతలు బండ ప్రకాశ్, మధుసూదనాచారి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్లందరినీ మళ్లీ గెలిపించుకుంటాం
భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ కార్పొరేటర్లందరినీ గెలిపించుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకు రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడారని కొనియాడారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కు భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీన దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో చేయనున్న ఏర్పాట్లపై మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






