KTR: తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు

by Gantepaka Srikanth |

తెలంగాణలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR: తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాము రాష్ట్రాన్ని అగ్రికల్చర్‌లో అగ్రస్థానంలో నిలిపితే.. కాంగ్రెస్ మాత్రం గన్ కల్చర్ తీసుకొచ్చిందని ఆరోపించారు. స్వయంగా మంత్రి కూతురు రాష్ట్రంలో గనకల్చర్ నడుస్తున్నదని.. పారిశ్రామికవేత్త నెత్తిన గన్ను పెట్టి బెదిరించారని చెబుతున్నారని అన్నారు. మరోవైపు.. పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దు అంటూ మంత్రి కుమార్తె ఆపితే.. స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని వెళ్లిపోయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ పాలన అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా కొడుతున్నదని ఆరోపించారు. రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన సీఎంను చూడలేదని విమర్శించారు. సీఎం అనుచరుడు, ఆప్తుడు రోహిన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పంపించారని ఆరోపణ చేసినప్పుడు, సిగ్గు లేకుండా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి సిగ్గు ఉంటే ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎంపై మంత్రి కూతురు ఆరోపణలు చేస్తే ఆ మంత్రిని పక్కకు జరపలేని స్థితిలో ఉన్నావని అన్నారు. కనీసం వారిని ముట్టుకోలేని బలహీన ముఖ్యమంత్రివి నువ్వు అని విమర్శించారు. సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలన్నారు. తన పరిపాలనపైన, మంత్రులపైన ఎలాంటి పట్టు లేదని తేలిపోయిందన్నారు.

సీఎంను తరిమేస్తేనే శని పోతది..

దావూద్ ఇబ్రహీంలాంటి ముఖ్యమంత్రిని తరిమేస్తనే రాష్ట్రానికి పట్టిన శనిపోతని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారని.. వీరి వాటాల పంచాయతీలో తమకు భాగస్వామ్యం వద్దని.. తమకు సంబంధం లేదంటూ పారిపోతున్నారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మంచి అధికారులు కూడా పారిపోయేలా చేసే దండుపాళ్యం ముఠా రాష్ట్రంలో ఉన్నదని.. ఆ ముఠానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నదని అన్నారు. తాను చెప్పిన పనిచేయలేదని ఐఏఎస్ రిజ్వీ ఆయన వీఆర్‌ఎస్ తీసుకుంటే.. ఆయన రాజీనామా ఆమోదించవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరడం దారుణమన్నారు. సీఎం సోదరుడు, ఎక్సైజ్ మంత్రి కొడుకు మధ్య నెలకొన్న పంచాయితీకి ఐఏఎస్ బలి అయ్యారని ఆరోపించారు. మంత్రుల అవినీతి వాటాల పంచాయితీలకు అధికారులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని అన్నారు. సీఎం వేల కోట్లు సంపాదిస్తుంటే, తాము వందల కోట్లయినా సంపాదించవద్దా అని మంత్రులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. గన్నులు పెట్టి బెదిరించడంతో ఇందిరమ్మ రాజ్యంలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

సెటిల్మెంట్లకు కేంద్రంగా సీఎం ఇల్లు

రెండు మూడు రోజులపాటు తిట్టుకొని సిగ్గు లేకుండా సీఎం, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారని.. ఏం సాధించారని స్వీట్లు పంచుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏం ఉద్ధరించారని సీఎంకు శాలువా కప్పి పీసీసీ ప్రెసిడెంట్ సన్మానం చేశారని నిలదీశారు. ఇద్దరు మంత్రులు కలిసి ఏం పొడిచారని స్వీట్లు పంచారన్నారు. వాటాల పంచాయితీ, అవినీతి సొమ్ముల పంపకాలు టెండర్ల రిగ్గింగ్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇంటి పంచాయితీ లెక్క మారిపోయాయని.. సీఎం ఇల్లు సెటిల్మెంట్‌లకు కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంత రాచకం కొనసాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, వాటాల పంచాయితీతోనే మంత్రులు బజారుకెక్కినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం ఏం పీకుతున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి అని.. తెచ్చింది రోహిన్‌రెడ్డి అని.. స్వయంగా మంత్రి కుమార్తె చెప్పిందని.. కానీ పోలీసులు చెప్తున్నది దానికి భిన్నంగా ఉన్నదని అన్నారు. అయితే.. రెండు అంశాల్లోనూ బెదిరింపులు గన్నుతో జరిగాయనేది వాస్తవమని.. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తనకు పింకు బుక్కులు లేవు, రెడ్డి బుక్కులు లేవు, కేవలం కాకీ బుక్కు మాత్రమే రాష్ట్రంలో ఉంటుందని గొప్పలకు పోయిన డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గన్ను తెచ్చింది ఎవరు? గన్ను గురిపెట్టింది ఎవరు? అనే విషయాన్ని తేల్చాలని.. ఈ అంశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డిని విచారణ చేసి ఆయన అభిప్రాయాన్ని రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. సుమంత్‌ను విచారించి నిజానిజాలు బయటపెట్టాలన్నారు. మంచిరేవులలో సీఎం సోదరుడు 15 ఎకరాలు.. కొండా సురేఖ 15 ఎకరాలు తీసుకొని మొత్తం 30 ఎకరాల భూమి పంచాయితీ పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తున్నదని అన్నారు.

Next Story