KTR: రేవంత్ రెడ్డి అహంభావం వల్ల రూ.15,000 కోట్ల నష్టం

by Gantepaka Srikanth |

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR: రేవంత్ రెడ్డి అహంభావం వల్ల రూ.15,000 కోట్ల నష్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమత కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఒక్కో మహిళకు రూ.55,000 బాకీ పడ్డారని అన్నారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక్కొక్కరికి రూ.44,000 బాకీ ఉన్నారని తెలిపారు. అలానే విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు కానీ, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలన్నింటినీ గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందన్నారు. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో పారిశుధ్య పనులు రోజూ జరిగేవని.. ఇప్పుడు చెత్త తీసేవారే కరువయ్యారని తెలిపారు. మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయని పేర్కొన్నారు.

రేవంత్ అహంభావం వల్లే రూ.15,000 కోట్ల నష్టం

రేవంత్‌రెడ్డి చేతకానితనం, మితిమీరిన అహంభావం కారణంగా రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పిందని, పౌరులపై మెట్రో రైల్వే ఎల్అండ్‌టీ సంస్థ కోసం తీసుకుంటామన్న ప్రభుత్వం నిర్ణయం వలన రూ.15,000 కోట్ల భారం పడిందని కేటీఆర్ ‘ఎక్స్’లో ఆరోపించారు. తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్ సిటీ వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను రద్దు చేశారని తెలిపారు. మేడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్అండ్‌టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థను బెదిరించారని.. ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసమే అని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయిందని.. ఆరోగ్యశ్రీ పథకం స్తంభించిందని తెలిపారు.

Next Story