- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ స్వయంగా శ్రీరాముడే బీజేపీని ఓడించాడు: కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమన్నారు. ఇక జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోడీ, ఇప్పుడు బిహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి (సీనియర్ గైనకాలజిస్ట్) బుధవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు.
అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. "రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది సిగ్గుమాలిన ప్రభుత్వం. యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారు. సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాష్టికాన్ని మేము వదిలిపెట్టం. ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తాం. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన 'మొహబ్బత్ కీ దుకాణ్'? పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి" అని అన్నారు.
కేంద్రంలోని మోడీ(PM Modi) ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. "జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు బిహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? దోచుకున్న ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలి. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయారు. కానీ, దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా" అని కేటీఆర్ విమర్శించారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వం అన్నారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసాన్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని చెప్పారు.
మోడీ, చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. "చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారు?" అని కేటీఆర్ నిలదీశారు.
గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదని, నాయకులుగా తామే విఫలం అయ్యామన్నారు కేటీఆర్. "దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు. కానీ, పదేళ్లలో మనం చేసిన పనులను ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయాం. నాయకులుగా మనమందరం విఫలమయ్యాం. 'మోసపోతే గోసపడతాం' అని కేసీఆర్ గారు ముందే హెచ్చరించారు. ఆయన చెప్పినట్లే ఇవాళ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి," అని విశ్లేషించారు. గంగుల కమలాకర్, వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ గౌతమి రెడ్డి స్ఫూర్తితో విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "'స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష' అన్న జయశంకర్ సార్ మాటలను నిజం చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు, యూరియా ఎలా వచ్చాయి? కాంగ్రెస్ రాగానే ఎందుకు కరువయ్యాయి? రేవంత్ రెడ్డికి సత్తా లేకపోవడమే ఇందుకు కారణం. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కేసీఆర్ ఆపలేదు. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన రాష్ట్రాన్ని 'క్యాన్సర్ పేషెంట్' అంటూ రేవంత్ పరువు తీస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ ప్రజలు మరోసారి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలి" అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు..






