తెలంగాణలో మరి కాంగ్రెస్ చేస్తున్నదేంటి ? కేటీఆర్ సూటి ప్రశ్న

by Ramesh Naini |

పథకాల పేరు మార్చి వాటిని పూర్తిగా పాతరేయడంలో కాంగ్రెస్ బీజేపీ “దొందూ దొందే” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణలో మరి కాంగ్రెస్ చేస్తున్నదేంటి ? కేటీఆర్ సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: పథకాల పేరు మార్చి వాటిని పూర్తిగా పాతరేయడంలో కాంగ్రెస్ బీజేపీ “దొందూ దొందే” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేయడం క్షమించరాని నేరం అని, పల్లె ప్రజలకు ఉపాధి కల్పించే.. పథకం గొంతుకోసిన బీజేపీ విధానాలు అత్యంత ఆక్షేపణీయం అని అన్నారు. జాతిపిత పేరును తొలగించిన బీజేపీకి అసలు జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేనే లేదన్నారు. అయితే.. దీనిపై గగ్గోలు పెడుతున్న.. కాంగ్రెస్ మరి తెలంగాణలో చేస్తున్నదేంటి అని నిలదీశారు. పార్టీల పేర్లతో సంబంధం లేకుండా.. 5 రూపాయలకే పేదల కడుపు నింపే "అన్నపూర్ణ క్యాంటీన్ల" పేరును "ఇందిరమ్మ క్యాంటీన్లు" గా మార్చడం.. కాంగ్రెస్ చేసిన చిల్లర రాజకీయం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన.. "బతుకమ్మ చీరలను" మధ్యలో నిలిపేసి చేనేత కార్మికుల పొట్ట కొట్టి.. చివరికి “ఇందిరమ్మ చీరలు” అని రాజకీయ రంగు పులమడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి “కాంగ్రెస్ తల్లి”ని నెత్తిన రుద్దడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.

దేశ చరిత్రలోనే తొలిసారి కేసీఆర్ మానస పుత్రిక.. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించిన “రైతుబంధు” పథకాన్ని రైతు భరోసాగా మార్చి ఎక్కువిస్తామని.. అసలుకే ఎసరు పెట్టడం దుర్మార్గం కాదా అని విమర్శించారు. కేసీఆర్ కిట్‌ను, న్యూట్రీషన్ కిట్లను మధ్యలో నిలిపేసి నిర్వీర్యం చేయడం కాంగ్రెస్ దుర్మార్గం కాదా? ఎన్నో అవార్డులు అందుకున్న పల్లె ప్రగతి పథకాన్ని.. పచ్చదనం స్వచ్ఛదనంగా మార్చి పైసా ఇవ్వకుండా దగా చేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. హరితహారాన్ని వనమహోత్సవంగా మార్చి నర్సరీలను ఎండగొట్టడం దుర్మార్గం కాదా ? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే పథకాలను పేర్లు మార్చి మొత్తానికే పాతరేయడం కాంగ్రెస్, బీజేపీలకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కానీ.. వైఎస్సార్ ప్రారంభించిన “ఆరోగ్యశ్రీ”ని అదే పేరుతో పదేళ్లపాటు కొనసాగించి విశాల దృక్పథాన్ని చాటిచెప్పింది బీఆర్ఎస్ అని కొనియాడారు.

అటు కాంగ్రెస్ అయినా.. ఇటు బీజేపీ అయినా.. ఈ రెండు ఢిల్లీ పార్టీలు.. సంకుచిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. కేవలం పథకాల పేర్లు మార్చి.. ప్రజలను ఏమార్చే కుట్రలు తప్ప.. దేశ ముఖచిత్రాన్ని, ప్రజల బతుకు చిత్రాన్ని మార్చాలన్న సోయి ఏమాత్రం లేని ఈ సన్నాసి పార్టీల చేతిలో..150 కోట్ల భారతం నలిగిపోతోంది.. అని ఇవాళ (గురువారం) ఎక్స్ వేదికగా తెలిపారు.

Next Story