- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబినెట్ మీటింగ్‍లోనైనా కళ్ళు తెరవండి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎంకు కేటీఆర్ లేఖ
పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవాలని, మృతి చెందిన రైతులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పంటల కొనుగోళ్లలో నెలకొన్న తీవ్ర సంక్షోభం, రైతుల అవస్థలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఎల్లుండి జరగబోయే కేబినెట్ మీటింగ్‌లోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డారని ఆరు దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగుచేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టిందని దుయ్యబట్టారు. రైతుకు రక్షణగా కేసీఆర్ అమలుచేసిన ఒక్కో పథకానికి గత రెండేన్నరేళ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్నువిరిచారని మండిపడ్డారు.
ఆ సోయి మీలో కనిపించడం లేదు:
ఇవాళ మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయని అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్థనాదాలు చేస్తున్నారు. చేతకాని మీ సర్కారు నిర్వాకం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలన చూసినా ఈరోజు రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారుని ఆరోపించారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలుతున్నా మీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. 70 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో ఒక్క శాతం రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదని విమర్శించారు.
దోచుకోవడంపై తప్ప పరిపాలనపై పట్టులేదు:
పెట్టుబడి సాయాన్ని వరుసగా నాలుగు సార్లు ఎగ్గొట్టినా, యూరియా కష్టాల పాలుజేసినా రైతులు అన్నింటినీ దిగమింగి పండించిన ఏ పంటను మీ ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకుతోడు సర్కారు చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోయారు. అయినా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు. అందుకే రైతులు మరో మార్గం కనిపించక, ఇంతకాలం కంటిపాపలా పెంచుకున్న పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారన్నారు. ఇవాళ తెలంగాణలోని రోడ్లపై కాలిబూడిదవుతున్న ధాన్యం కుప్పలు మీ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో నిరసనలో పాల్గొనని రైతు లేడు, రాస్తారోకో జరగని రహదారి లేదు. ఈ 30 నెలల్లోనే సమైక్యరాష్ట్రం నాటి సకల కష్టాల్లో మళ్లీ రైతులను ముంచెత్తారు. ఇన్నాళ్లు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చారు. కష్టాల్లో కొట్టమిట్టాడుతున్న తెలంగాణ రైతుల కన్నీళ్లతో ఖాళీగా ఉన్న రిజర్వాయర్లు నిండేలా ఉన్నాయి. పగలూ రాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై తప్ప పరిపాలనపై మీకు కనీస పట్టులేకపోవడం అన్నదాతకు శాపంగా మారిందన్నారు.
ముక్కు నేలకు రాయండి:
విలువైన భూములను తెగనమ్మి వేలకోట్లు దోచుకోవాలన్న ఉత్సాహం తప్ప రైతుల పంటలను కొనాలన్న ధ్యాస మీలో ఏమాత్రం కనిపించడం లేదు. రోడ్లపై జరుగుతున్న నిరసనలనుంచి తప్పించుకునేందుకు, మీ మంత్రులు హెలికాప్టర్ లో షికార్లు కొడుతున్నారు. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే, సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ నుంచి ఖమ్మం దాకా అనేక జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం ఒక్కటంటే ఒక్క లారీ లోడ్ కూడా ఎత్తడం లేదు. ఇక అడపా దడపా చేసే కొనుగోళ్లలోనూ ఒక్కోచోట 10 కిలోలకు పైగా తరుగుతీస్తే ఇక రైతులకు మిగిలేదేంటో మీరే సమాధానం చెప్పాలి. చివరికి గన్నీ బ్యాగు కోసం రైతులే 50 రూపాయల చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చినందుకు మీరు, మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇచ్చే ముఖం మీ సర్కారుకు ఎలాగూ లేదని ఇప్పటికే తేలిపోయిందని చివరికి పంట కొనుగోలు కూడా చేయడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు మీరు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయండి. అన్నదాతలు అడుగడుగడునా పడిగాపులు పడుతుంటే వాటిని వదిలేసి, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలన్న మీ సర్కారుకు ప్రాధాన్యతలే కాదు, చివరికి సోయి కూడా లేదని తేలిపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు ఉండి రైతులకు ఏం ప్రయోజనం:
కేసీఆర్ హయాంలో మూడు నెల ముందు నుంచే పంటల కొనుగోలు ప్రణాళికలను పకడ్బందీగా అమలుచేసే వారని, గన్నీ బ్యాగుల నుంచి మొదలుకుని రైతుల ఖాతాల్లో పంట డబ్బులు సకాలంలో జమ అయ్యేదాకా నిరంతర సమీక్షలతో పర్యవేక్షించేవారు. కరోనా కష్టకాలంలోనూ రైతు కల్లాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకూ కొని రైతుల్లో అచెంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలా పండుగలా సాగిన వ్యవసాయంపై మీరు పగబట్టి రైతులకు చేసిన ద్రోహం అందరికీ అర్థమైపోయిందని విమర్శించారు. రైతులు తమ పంటకు నిప్పు పెట్టుకుంటున్నా మొద్దునిద్ర వీడని ముఖ్యమంత్రిని చూసి యావత్ రైతాంగం శాపనార్థాలు పెడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల నుంచి తమ పంటను కాపాడుకునేందుకు చివరికి టార్పాలిన్లు కూడా సమకూర్చలేని మీ కాంగ్రెస్ సర్కారు ఉండి రైతులకు ఏం ప్రయోజనం. అనేక చోట్ల చెడగొట్టు వానలు పడి కళ్లముందే పంట కొట్టుకుపోతున్నా కాపాడుకోలేని నిస్సాహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
మీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి:
బీఆర్ఎస్ హయాంలో సంబురంగా సాగిన సాగును కష్టాల కడలిలో ముంచెత్తిన మీ పాపానికి ఇప్పటికే వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. రైతుల ఆర్థనాదాలు ఏమాత్రం వినిపించుకునే తీరిక లేని మీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. మొత్తంగానే వ్యవసాయాన్ని పాతాళంలోకి నెట్టిన మీ దద్దమ్మ పాలనపై ఇప్పటికే రైతుల్లో తిరుగుబాటు మొదలైంది. 60 రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు మరణశాసనం రాసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రమంతా రైతుల నిరసనలు హోరెత్తుతున్న ఈ తరుణంలో 23న నిర్వహించే కేబినెట్ సమావేశంలోనైనా లెంపలేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టండి. వేలాది కొనుగోలు కేంద్రాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ప్రతి పంటను కొని వెంటనే రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించండి. అలాగే మీరు చేసిన పాపాలకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని లేకపోతే మీరు చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారని హెచ్చరించారు.






