6 గ్యారెంటీల అమలుకు బడ్జెట్‍లో నిధులు కేటాయించాలని సీఎంకు కేటీఆర్ లేఖ

by Prasad Jukanti |

హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ను నిలదీస్తామన్న హెచ్చరించారు.

6 గ్యారెంటీల అమలుకు బడ్జెట్‍లో నిధులు కేటాయించాలని సీఎంకు కేటీఆర్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్‍లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈసారి బడ్జెట్‍లో(Telangana Budget 2026-27) అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. నిధులు కేటాయించకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలను పక్కన పెట్టారని రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం కేటాయింపులు చేయని ప్రభుత్వం ఈ బడ్జెట్‍లో అయినా నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన కోరుతున్నానన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చండి:

ఆరు గ్యారెంటీలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. ఆయా వర్గాలకి రెండు సంవత్సరాలుగా ఎగగొట్టిన హామీలను… కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన నిధుల బకాయిలకు ఈసారి కేటాయింపులు చేయాలన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. 2026-2027 బడ్జెట్‌లో 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‍ను ప్రజలపక్షాన నిలదీస్తామని హెచ్చరించారు.

సీఎం, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేదు:

కేసీఆర్ హయాంలో తెలంగాణను పంజాబ్‍నే తలదన్నేలా, దేశానికే ధాన్యాగారంగా తీర్చిదిద్దిన రైతులకు అందిన రైతుబంధును 15 వేలకు వెంచాతమని మాటిచ్చి మోసం చేసినందుకు ముందు క్షమాపణలు చెప్పి, ఆ మొత్తాన్ని బడ్జెట్‍లో కేటాయించాలన్నారు. తొలి ఏడాదే రెండులక్షల ఉద్యోగాల భర్తీతోపాటు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‍లో కేటాయింపులు చేయాలన్నారు. ప్రస్తుతం మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్న వార్తలు, సమాచారం ప్రకారం రానున్న బడ్జెట్‌లో కూడా అభయహస్తంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలకు నిధుల కేటాయింపు చేస్తున్నట్లు కనబడటం లేదని ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి, నిట్టనిలువునా మోసగించడానికే సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతోందన్నారు. పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రతిసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలని మీరు చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయాయన్నారు. నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై మీ పాపాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నాయి.. ప్రజల నోట్లో మట్టి కొట్టిన మీ పాపాల ప్రక్షాళన జరగాలంటే కనీసంఈ సారి బడ్జెట్ లోనైనా మ్యానిఫెస్టోలో హామీల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‍ను ప్రజలపక్షాన నిలదీస్తామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరించారు.

Next Story