- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ వన్ మ్యాన్ షో అట్టర్ ప్లాప్
‘జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ.. ఆయన తండ్రి పెద్ద రౌడీ.. వాళ్ల మీద కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి పేదలను బజారు పాలు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ.. ఆయన తండ్రి పెద్ద రౌడీ.. వాళ్ల మీద కేసులు ఉన్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి పేదలను బజారు పాలు చేసింది. హైడ్రాతో ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది..’ ఇది ఉపఎన్నిక వేళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేసిన ప్రచారం. అందులోనూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేసినా ఈ అంశాలనే ఆయుధంగా చేసుకొని మాట్లాడారు. కానీ.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మలేదని ఎన్నికల ఫలితం స్పష్టం చేసింది. కాంగ్రెస్ హైడ్రాను తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను కాపాడిందనే విషయాన్నే వారు బలంగా నమ్మారు.
రౌడీలు.. అన్న మాటలనూ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. వారు చేసిన మంచినే గుర్తుచేసుకుంటూ పోలింగ్ సెంటర్లకు వెళ్లి ఓటు వేశారు. కేటీఆర్ ప్రచారంలో అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇటు అభ్యర్థి నవీన్ యాదవ్, అతడి తండ్రి మీద వ్యక్తిగత విమర్శలకు పోయారు. అయితే వీటిని ప్రజలెవరూ పెద్దగా నమ్మలేదు. హైడ్రా నెపంతో కాంగ్రెస్ పార్టీపై, సీఎంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసినా.. అవి ప్రజల్లో వ్యతిరేకతనే తీసుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో డిజిటలైజేషన్ వాడినా పెద్దగా ప్రజలు వాటికి ప్రభావితం కాలేదని తేలిపోయింది.
హైదరాబాద్ లో కేటీఆర్ గ్రాఫ్ డౌన్
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎమ్మెల్యే సీట్లను ప్రస్తావిస్తూ ఇన్నాళ్లు హైదరాబాద్‌లో మాదే హవా అన్న కేటీఆర్ మాటలు ఈ ఫలితంతో తేలిపోయాయి. సిటీలో ఇటు బీఆర్ఎస్‌తోపాటు అటు కేటీఆర్ ప్రభావం చూపలేకపోయారని స్పష్టమైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు హైదరాబాద్‌కు ఇన్‌చార్జిగా కేటీఆర్ ఉన్నారు. దీంతో చాలావరకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకే మద్దతు పలికారు. అయితే.. అధికారం కోల్పోవడం, ఈ రెండేళ్లలో కేటీఆర్ వైఖరిని గమనిస్తూ వచ్చిన జనం ఇప్పుడు ఆ పార్టీకి దూరం అయినట్లుగా తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచీ కేటీఆర్‌కు అంతా తానే.. అన్న ఫీలింగ్ ఉంటుందని, అంతేకాకుండా ఆయన చుట్టూ కొంతమందితో కోటరీ ఉందని, ఆయనను కలవాలంటే ముందు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వైఖరే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం చూపిందనే చర్చ సాగుతోంది.
కేసీఆర్‌కు ఓటమి ముందే తెలుసా..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్ పేరు సైతం ఉంది. దాంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారని అంతా భావించారు. అటు కార్యకర్తల్లోనూ అదే భరోసా కనిపించింది. అధినేత ప్రచారంతో గెలుపు ఈజీ అని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నిక సమయంలోనూ కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. కనీసం ఒక్కరోజైనా వచ్చి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారని అనుకున్నా.. చివరకు నిరాశే మిగిలింది. అయితే.. కేసీఆర్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటమి గురించి ముందే తెలిసిపోయిందా..? ఇక్కడి ఓటమిని ఆయన ముందే అంచనా వేసి ప్రచారానికి రాలేదా..? అన్న టాక్ నడుస్తోంది. అందుకే ఈ ఎన్నికను ఆయన పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదనే ప్రచారం వినిపిస్తోంది.






