ఇకనుంచి మన పని అదే.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కీలక టాస్క్

by Gantepaka Srikanth |

త్వరలో తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై దృష్టి సారించాలని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ఇకనుంచి మన పని అదే.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ కీలక టాస్క్
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై దృష్టి సారించాలని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ అక్రమాలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపైన పార్టీ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని అనేక రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీ తీసివేసిందన్న ఆరోపణలు విస్తృతంగా తలెత్తుతున్నాయన్నారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధిపొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకుంటూనే దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలన్నారు. సర్ ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సవరించి కొత్తగా ఓటర్లను నమోదు చేసేందుకు ఉద్దేశించిందని, ప్రతి బూత్ వారీగా దొంగ ఓటర్లను తొలగించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతను ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ తరఫున నియమించే బూత్ లెవల్ ఏజెంట్లు ప్రయత్నం చేయాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు అందించి వారి నియామకం వెంటనే పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు. వారికి పార్టీ తరఫున శిక్షణ ఇస్తామన్నారు.

Next Story