- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ గురుకులాల్లో మరణ మృదంగం: కేటీఆర్
2024 నుండి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బందీగా మార్చారని.. తాము 14 రోజుల క్రితం హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: 2024 నుండి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బందీగా మార్చారని.. తాము 14 రోజుల క్రితం హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే, కాంగ్రెస్ మాత్రం రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం 12 పైసలు కూడా విదిల్చలేదని విమర్శించారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తోపాటు బీసీ, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ సిద్ధాంతమే పునాదిగా తాము రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా, చేతల్లో గౌరవం చూపించాలనే ఉద్దేశంతో దళిత బిడ్డల కోసం 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, అలాగే రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టి గౌరవించుకున్నామని వివరించారు. అనంతరం భవనంలోని మ్యూజియంను సందర్శించారు.
ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ లేదు..
రాజ్యాంగంలోని ఆర్టికల్3 అనేది లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదని కేటీఆర్ అన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేసీఆర్ ప్రభుత్వం 1,000 గురుకుల పాఠశాలలు పెట్టిందని.. దాదాపు రూ.6.5 లక్షల మంది పిల్లలకు, ఏడాదికి ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలని సంకల్పించిందన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నదని ఆరోపించారు. ప్రస్తుతం గురుకులాల్లో మరణ మృదంగం మోగుతున్నదని.. ఆహార కల్తీ, ఆత్మహత్యలతో 130 మందికి పైగా విద్యార్థులు మరణించడం దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంబేద్కర్‌ను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నదే తప్ప గౌరవించలేదని పేర్కొన్నారు. 1952, 1954లో ఆయన పార్లమెంటుకు రాకుండా కుట్రలు చేసి ఓడించిందన్నారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు హక్కులు కల్పించాలని ఆయన చూస్తే, దాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయనకు ఆ గౌరవం దక్కిందన్నారు. చివరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆయన ఫొటో పెట్టేందుకు సైతం కాంగ్రెస్ ఒప్పుకోలేదని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువజన డిక్లరేషన్, ఇక్కడ విద్యార్థి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్.. ఇలా ప్రతి దాని మీద కాంగ్రెస్ చేసిన ప్రామిస్‌ల మీద మనం పకడ్బందీగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎదుర్కొందామని అన్నారు.






