ప్రజలకు నిజాలు చెప్పాలి: కేటీఆర్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు.

ప్రజలకు నిజాలు చెప్పాలి: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ, పెరిగిన ధరలపై ఆందోళనను తెలియజేశారు. అనంతరం అదే ప్లకార్డులతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతున్నదని.. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్నదని అన్నారు. కేంద్రం అధీనంలో పెట్రోలియం శాఖ ఉన్నదని.. తాము ఏం చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు. ఫ్యూచర్‌లో గ్యాస్‌ సిలిండర్‌ సైజ్‌ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయని.. 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను 10 కిలోలకు తగ్గిస్తారంట అని ఆరోపించారు. సామాన్య ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం..

దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ బయట కేటీఆర్‌ను దివ్యాంగులు కలిసి వినతిపత్రం అందించారు. ఈ మేరకు నేడు ఇందిరాపార్కు వద్ద దివ్యాంగుల నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందుల గురవుతున్నారని.. దివ్యాంగులు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. రూ.6,000 పెన్షన్ ఇస్తానని ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామన్నారు. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story