ఎక్కడ డిక్లరేషన్ ఇచ్చారో అక్కడే సభలు.. BRS కార్యాచరణ ప్రకటించిన కేటీఆర్

by Prasad Jukanti |

ఏప్రిల్ 20న జగిత్యాల సభకు కేసీఆర్ హాజరుకానున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

ఎక్కడ డిక్లరేషన్ ఇచ్చారో అక్కడే సభలు.. BRS కార్యాచరణ ప్రకటించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులకు‍పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాబోయే రెండేళ్లకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కాబోతున్నారని ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రెండు కార్యక్రమాలు అయ్యాక మే, జూన్ నెల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలను ట్రాక్ ఎక్కించబోతున్నట్లు వెల్లడించారు. తొలుత ఎస్సీ, ఎస్టీలతోనే మొదలు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను మోసం చేసిందని ఈ విషయాన్ని గుర్తు చేసేలా ఏయే ప్రాంతాల్లో డిక్లరేషన్లు ప్రకటించారో అదే ప్రాంతంలో ఆ డిక్లరేషన్లను గుర్తు చేస్తూ సభలు పెట్టబోతున్నట్లు వెల్లడించారు.

అంబేద్కర్ ను కాంగ్రెస్ రాజకీయాలకు వాడుకుంది:

అంబేద్కర్ బాటలో తెలంగాణ సాధించామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను తన రాజకీయాల కోసం వాడుకుందని, రెండు సార్లు పార్లమెంట్ కు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంబేద్కర్‍కు భారతరత్న ఇవ్వలేదని కనీసం పార్లమెంట్ లో ఆయన ఫోటో కూడా పెట్టలేదన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని సంకెళ్లతో బంధిస్తే మేము ఆరోజు వార్నింగ్ ఇస్తే ఈరోజు అంబేడ్కర్ విగ్రహం దగ్గర గేట్లు తెరుచుకున్నాయన్నారు. కాంగ్రెస్ ది అరాచక, మూర్ఖపు ప్రభుత్వం అని ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. వెయ్యి గురుకులాల్లో మరణ మృదంగం మోగుతోందన్నారు.

Next Story