అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తాం: KTR

by Gantepaka Srikanth |

కాంగ్రెస్‌కు ఓటేయ‌క‌పోతే ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తామ‌ని రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని.. ఎవ‌డ‌బ్బ సొమ్మని ప‌థ‌కాలు బంద్ చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తాం: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌కు ఓటేయ‌క‌పోతే ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తామ‌ని రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని.. ఎవ‌డ‌బ్బ సొమ్మని ప‌థ‌కాలు బంద్ చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ తోఫా లేదు.. బ‌తుక‌మ్మ చీర లేదు.. క్రిస్మస్ గిఫ్ట్ లేదు.. ఇలా అన్నీ బంద్ అయ్యాయని.. బీఆర్ఎస్‌ను గెలిపించండి.. కాంగ్రెస్ గ‌ల్లా ప‌ట్టి ప‌థ‌కాలు అమ‌లు చేపిస్తామని చెప్పారు. హైద‌రాబాద్‌ను బ‌ర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 4 కోట్ల మంది ప్రజ‌ల త‌రఫున 4 ల‌క్షల మంది జూబ్లీహిల్స్ ప్రజ‌లు తీర్పు చెప్పబోతున్నారని అన్నారు. బోర‌బండ‌లో వ‌చ్చిన జ‌నాన్ని చూస్తుంటే గెలుపు ప‌క్కా అని తేలిపోయిందని.. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని అన్నారు. కేసీఆర్ తిరిగి ఈ రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని ప్రజ‌లు కోరుకుంటున్నారని.. ఒక్కరిని కూడా మోసం చేయ‌కుండా కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టలేదని చెప్పారు.

ఇంకా హామీల అమలు లేదు..

‘కాంగ్రెస్ హామీలు ఇచ్చి రెండేళ్లైంది.. ఇంకా అమ‌లు కావ‌ట్లేదు’ అని కేటీఆర్ విమర్శించారు. స్కూటీలు రాలేదని.. ఇందిర‌మ్మ ఇల్లు రాలేదని.. రూ.4వేలు పెన్షన్ లేదని.. ఏ ఒక్క హామీ అమ‌లు కాలేదని పేర్కొన్నారు. రేవంత్‌కు ఒక్క చాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవ‌ర్లు ఆత్మహ‌త్య చేసుకున్నారని.. ఒక్క చాన్స్ ఇస్తే పేద‌ల ఇళ్లు కూల‌గొట్టారని.. మ‌హిళ‌ల‌ను మోసం చేశారని.. హైద‌రాబాద్‌ను నాశ‌నం చేశారని.. రియ‌ల్ ఎస్టేట్‌ను దెబ్బ తీశారని అన్నారు. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణ‌ను లాస్ట్ ప్లేస్‌కు దిగ‌జార్చారని తెలిపారు. పేద‌ల ఇళ్లపైకి బుల్డోజ‌ర్లు రాకూడ‌దంటే సునీత‌మ్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కారు, బుల్డోజ‌ర్ మ‌ధ్య జ‌రుగుతున్నాయని.. బుల్డోజ‌ర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. హైడ్రా బాధితుల బాధ‌ను చూస్తే ప్రతి ఒక్కరికీ క‌ళ్లలో నీళ్లు వ‌స్తాయని.. హైడ్రా పేరుతో వేలాది మంది ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిందని చెప్పారు. హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తాం..

ప్రతి పేద వాడికి తాము అండ‌గా నిల‌బ‌డతామని.. బుల్డోజ‌ర్లకు అడ్డంగా ప‌డుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప‌క్కనే తెలంగాణ భ‌వ‌న్ ఉన్నదని.. అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంట‌లో మీ వ‌ద్దకు వ‌స్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు భ‌య‌పెడితే.. తాము వ‌చ్చి వాళ్ల సంగ‌తి తేలుస్తామన్నారు. ఢిల్లీకి పంపేందుకు పైస‌లు ఉన్నాయి కానీ.. పేద‌ల‌కు ఇచ్చేందుకు మాత్రం ఈ ప్రభుత్వం వద్ద పైస‌లు లేవని అన్నారు. రేవంత్‌రెడ్డి త‌న కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్‌గాంధీకి పంపిస్తున్నారని.. త‌మ వ‌ద్ద నిధులు లేవ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్‌రెడ్డి బ‌హిరంగంగా ఈ మాట‌లు చెప్పారని ఆరోపించారు. మ‌రో ఎమ్మెల్యే వంద కోట్లు కావాలంటూ ప్రపంచ బ్యాంక్‌కు అప్లికేష‌న్ పెట్టుకున్నారని.. కంటోన్మెంట్‌లో రేవంత్‌రెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పారని.. ఇప్పటి వ‌ర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్క పైసా కూడా విడుద‌ల చేయ‌లేదని వెల్లడించారు. అక్కడ చేయ‌ని అభివృద్ధి.. జూబ్లీహిల్స్ ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో రెండు ల‌క్షల ఉద్యోగాలు, నిరుద్యోగుల‌కు రూ.4వేలు ఇస్తామ‌ని చెప్పి మాట త‌ప్పారన్నారు. నోటిఫికేష‌న్‌లు లేవు కానీ.. లూటిఫికేష‌న్ మాత్రం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగుల‌ను లాఠీల‌తో కొడుతున్నారని తెలిపారు. హిట్లర్ వంటి నియంత‌ల‌కు ప‌రాభ‌వం త‌ప్పలేదని.. రేవంత్‌రెడ్డి ఎంత‌ అని అన్నారు. అలాగే.. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దొంగ ఓట్లు వేస్తారంటా..! పైస‌లు ఇచ్చి ఓట్లు కొంటారంటా..! పైస‌లు ఇస్తే తీసుకొని.. ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని కోరారు.

Next Story