- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపీ కొట్టే పరిస్థితి లేదు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
భారతీయ యువత ఉద్యోగాల కోసం వెతికేవారిలా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ యువత ఉద్యోగాల కోసం వెతికేవారిలా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఫైర్‌సైడ్ చాట్’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్ ఆర్థిక గమనం, కృత్రిమ మేధ, వ్యవస్థాపకత, మారుతున్న ఉద్యోగ రంగాలపై తన లోతైన విశ్లేషణలను విద్యార్థులతో పంచుకున్నారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం కేటీఆర్ ప్రత్యేక చర్చ గోష్టిలో పాల్గొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రగతి, నిరుద్యోగం, యువత, గెలుపు ఓటముల వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. 3జీ, 4జీ, 5జీ వంటి టెలికాం సాంకేతికతలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే అందిపుచ్చుకున్నదని గుర్తుచేశారు. ఇప్పుడు భారత్ ఒక కీలక దశలో ఉన్నదని.. ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను కాపీ కొట్టే పరిస్థితి లేదని, సొంతంగా వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులు తీసుకురాబోతోన్నదని కేటీఆర్ హెచ్చరించారు. ఏఐ వల్ల రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని.. ఈ విప్లవాన్ని తట్టుకోవాలంటే యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. తాజాగా ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
హైదరాబాద్ తరహా ఇన్నోవేషన్ హబ్‌లు కావాలి...
స్టార్టప్ కంపెనీలకు హైదరాబాద్ ఒక ఉదాహరణ అని కేటీఆర్ చెప్పారు. ఇంక్యుబేటర్లు, కో-వర్కింగ్ స్పేస్‌లు, మెంటార్ల ప్రోత్సాహం వల్లనే హైదరాబాద్ నుంచి అనేక యూనికార్న్ సంస్థలు పుట్టుకొచ్చాయని వివరించారు. దేశంలో వ్యవస్థాపకత పెరగాలంటే కేవలం పథకాలు ఉంటే సరిపోదని, ఒక పటిష్టమైన ఎకో సిస్టమ్ అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న యువ జనాభా ఒక శక్తి అని, అదే సమయంలో అది ఒక సవాల్ అని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే కేవలం అవకాశాలు కల్పిస్తే సరిపోదని, సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని సూచించారు.






