బీఆర్‌ఎస్ బౌన్స్ బ్యాక్ ఖాయం: KTR

by Gantepaka Srikanth |

బీఆర్‌ఎస్ బౌన్స్ బ్యాక్ ఖాయం: KTR

బీఆర్‌ఎస్ బౌన్స్ బ్యాక్ ఖాయం: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్‌కు తిరిగి అవకాశం ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే, ప్రజలు తప్పకుండా అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లిన అఖిలేష్.. కేటీఆర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, ఒక్కోసారి ప్రజలు మన పనితీరును, విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరిస్తూ.. గతంలో తాము కూడా చాలా తక్కువ సీట్లు గెలిచామని.. కానీ, ప్రజలు తమ వెంటే నిలిచారని తెలిపారు. వారి మద్దతుతోనే యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి, 37 మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నామని వెల్లడించారు. కచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రతికూలత పోవాలని, అభివృద్ధి, సానుకూల దృక్పథంతో కూడిన ప్రగతిశీల రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. తాము అదే విజన్‌తో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

అఖిలేష్ మాకు స్ఫూర్తి: కేటీఆర్

అంతకుముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టిన అఖిలేష్ తీరు తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అదే స్ఫూర్తితో బీఆర్‌ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్‌తో సమావేశం అవుతారని తెలిపారు.

Next Story