చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టండి.. కేటీఆర్ పిలుపు

by Gantepaka Srikanth |

గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని.. రేవంత్‌రెడ్డిని చూశాకే ప్రజలకు కేసీఆర్ విలువ తెలిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టండి.. కేటీఆర్ పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని.. రేవంత్‌రెడ్డిని చూశాకే ప్రజలకు కేసీఆర్ విలువ తెలిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్‌రావు, ఆయన అనుచరులు ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్.. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదేళ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదన్నారు. మల్లన్నసాగర్, కొండపొచమ్మసాగర్‌తో రాబోయే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం సిగ్గుచేటన్నారు. సీబీఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, రేవంత్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనం అన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ ను బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు.

రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగం

రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. కేవలం 21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని ప్రతి ఒక్కరూ అంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నదన్నారు. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందన్నారు. రేవంత్‌రెడ్డి తన మాటలతో, చేతలతో సీఎం పీఠానికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణను క్యాన్సర్, ఎయిడ్స్ రోగితో పోల్చడం, ఢిల్లీకి పోతే తనను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని అనడం, పేగులు మెడలో వేసుకుంటా లాంటి మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు, రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతున్నారన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెబుతున్నారన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన పది హామీల్లో ఎనిమిదింటిని పూర్తిగా, రెండింటిని పాక్షికంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. అయినప్పటికీ సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు.

స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీల్లో తాను భద్రాచలం, కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మోసాలను, బీజేపీతో పొంచి ఉన్న ముప్పును ప్రజలకు వివరించాలన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి, అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడమే శరణ్యం అన్నారు. ఇంకా మూడేళ్లు అధికార పార్టీలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ ఉండలేక ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు.

Next Story