KTR: సీఎం రేవంత్‌కు నాదొక విన్నపం

by Gantepaka Srikanth |

ప్రజాస్వామ్యంలో చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీపై ఆయన పరోక్షంగా స్పందించారు.

KTR: సీఎం రేవంత్‌కు నాదొక విన్నపం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్యంలో చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీపై ఆయన పరోక్షంగా స్పందించారు. వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన పనిలేదని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రాంతీయ పార్టీలు చాలా తక్కువని, కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ, ఆ తరువాత బీఆర్ఎస్ మాత్రమే 25 ఏండ్లు పూర్తి చేసుకున్నాయని చెప్పారు. కేసీఆర్ గురించి చాలామంది మాట్లాడుతున్నారని.. పట్టించుకోనక్కర్లేదని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ పార్టీ రాష్ట్ర కమిటీని ఉద్దేశించి పూర్తి స్థాయి దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. ముందుగా పార్టీలో చేరిన సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డిని జనరల్ సెక్రటరీగా పరిచయం చేసి ప్రకటించారని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసిన నాడు ఉన్న దుర్భరమైన తెలంగాణ పరిస్థితిని, ఆనాటి రాజకీయ ముఖచిత్రం గురించి వివరంగా తెలియజేశారని అన్నారు. ఎంతో ధైర్యంతో, బలమైన దీక్షతో ఆనాడు పార్టీని ఒక్కడిగా ఏర్పాటు చేసి 25 ఏళ్లపాటు తెలంగాణ కోసం సాగించిన పోరాటాన్ని, ఉద్యమాన్ని, ప్రభుత్వ పరిపాలన పరిణామక్రమాన్ని వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం పడుతున్న బాధలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.

నిలదీసి క్షమాపణ చెప్పించేవాళ్లం..

రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ ఏర్పాటుకు ముందున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి వచ్చిందని తెలిపారు. కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వంటి సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి మంత్రులు చర్చోపచర్చలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో తేజస్వి సూర్య మాట్లాడిన మాటలపై మౌనంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను సమావేశం పూర్తిస్థాయిలో ఖండించినట్లు చెప్పారు. అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా లోక్‌సభలో వెంటనే తిరగబడి అక్కడికక్కడే తేజస్వీ సూర్యను నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేదని.. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారని అన్నారు. ఆ తరువాత తేజస్వీ సూర్య తనకు కాల్ చేశారని కేటీఆర్ చెప్పారు. ‘బ్రదర్ నేనేదో అన్నాను. తప్పుగా అర్థం చేసుకున్నారు మీవాళ్లు’ అని చెప్పినట్లు తెలిపారు. ‘మీరు మాట్లాడింది చాలా తప్పు అని’ వారికి చెప్పినట్లు వెల్లడించారు. ‘విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. పార్లమెంట్ లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు కానీ మీరు చేసింది చాలా తప్పు అని అన్నాను’ అని తెలిపారు. తాము ఖండించిన తర్వాతనే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకున్నారని వెల్లడించారు.

పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్

పార్టీ పునర్నిర్మాణం పై ఫోకస్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్ని కమిటీలనూ రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీటి పునర్నియామకం జరుగుతుందని, గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలని కూడా సూచించారని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. లేనిపక్షంలో గ్రామగ్రామాన పోరాటం చేస్తామని వెల్లడించారు. 30 ఏళ్లుగా ఏదో ఒక అడ్డంకి కలిగిస్తూనే ఉన్నారని.. మహిళా రిజర్వేషన్ల సాధనకు పార్టీ తరపున పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్‌లో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలని సూచించారు. అలాగే.. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందని.. పార్టీ శ్రేణులకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

చీఫ్ మినిస్టర్ చీప్ మాటలొద్దు..

సీఎం రేవంత్‌కు తనదొక విన్నపం అని.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఇలాంటి చీప్ మాటలు మాట్లాడటం పద్ధతి కాదని కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రిగా విధానపరమైన అంశాల మీద మాట్లాడితే, ప్రధాన ప్రతిపక్షంగా తాము స్పందిస్తామని.. జవాబిస్తామని అన్నారు. కానీ, విషయం మీద మాట్లాడే అవగాహన లేక ఎంతసేపూ విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం తప్ప రేవంత్‌రెడ్డికి ఇంకోటి రాదని ఎద్దేవా చేశారు. ఆయన తమ పార్టీ ఎక్స్‌పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నారని.. అసలు కాంగ్రెస్ పార్టీ చితికిలపడి ఎన్నేళ్లయిందని ప్రశ్నించారు. పన్నెండు, పదమూడేళ్లుగా ఆ పార్టీ లేవలేకపోతున్నదని.. ముందు మీ స్థాయి ఏంటో, మీ పరిస్థితి ఏంటో చూసుకోవాలని సూచించారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే మీరు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయారన్నారు. చిట్‌చాట్ పేరిట లీకులు ఇవ్వడం కాదని.. ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. నిజానికి ఆయనది ఐడెంటిటీ క్రైసిస్ అని.. ఆయన్ని ఎక్కడికి వెళ్లినా ఎవరూ సీఎంగా గుర్తించడం లేదని అన్నారు. యాంకర్లు, యాక్టర్లు, ప్రజలు, చివరకు ప్రతిపక్ష నాయకుడు కూడా గుర్తించడం లేదన్నారు.

Next Story