- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: రేవంత్‌కు రూ.200 కోట్లతో మరో ప్యాలెస్
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో పాల్గొన్నారు. మూడున్నర కిలోమీటర్ల పాటు బాధితులను కలిశారు. ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని.. ఈ పోరాటంలో బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కూలగొట్టడం మాత్రమే రేవంత్‌కు తెలుసు..
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని చెప్పారు. ఒకవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం చేస్తున్నదంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతోపాటు మిగిలిన నేతలంతా చెబుతుంటే.. తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని దాని అరాచకాలను మాత్రం ఆపకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ పంపిస్తున్న సంచుల కట్టల కోసం చూడకుండా వదిలేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌కు రూ.200 కోట్లతో మరో ప్యాలెస్..
సీఎం కోసం ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా.. దాన్ని కాదని రూ.200 కోట్లతో మరో నివాసం నిర్మించుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే ఆయనకు ప్యాలెస్ లాంటి ఇల్లు ఉన్నదని.. అయినా రేవంత్‌రెడ్డికి, ఆయన అన్నదమ్ములకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ.. పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసం అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్‌రెడ్డి, అటు రామగుండం, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారన్నారు. మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం రూ.16 వేల కోట్లతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు కూడా పోకుండా డీపీఆర్‌ని సిద్ధం చేశామని చెప్పారు. దానిని పక్కన పెట్టి లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ కోసం రేవంత్‌రెడ్డి కొత్త స్కామ్‌కు తెరలేపారన్నారు. మూసీలో ఇళ్లు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రులు, తమ పార్టీ ప్రజాప్రతినిధులకు ఉన్న ఫాంహౌస్‌లు, విల్లాలను, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం ఇళ్లను కూల్చడం ఆపేయాలని.. ఎమ్మెల్యేలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని హెచ్చరించారు.






