రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |

తెలంగాణలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మొత్తం 4332 స్థానాలకు గాను 1207 స్థానాల్లో విజయం సాధించింది.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో జరిగిన రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మొత్తం 4332 స్థానాలకు గాను 1207 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ అద్వితీయ ఫలితాలు సాధించిందని, పల్లె ప్రజలు గులాబీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ సత్తా చాటడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, ప్రభుత్వ పెద్దల కోటలు బీటలు వారడం అధికార పార్టీపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని సూచిస్తుందని బీఆర్‌ఎస్ విమర్శించింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు/గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్‌కు ఉరితాళ్లుగా మారి ప్రజాక్షేత్రంలో ఆ పార్టీని పెకిలిస్తున్నాయని కేటీఆర్ దుయ్యబట్టింది.

పార్టీ గుర్తు లేని ఈ ఎన్నికల్లోనే అధికార పార్టీ సగం పంచాయతీలను కూడా గెలవలేని దుస్థితిని చూస్తుంటే, గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. అసమర్థ పాలన, అరాచకాలు, మోసాలు, అవినీతిపై బీఆర్‌ఎస్ సాగిస్తున్న పోరాటాన్ని తెలంగాణ సమాజం ఆశీర్వదిస్తోందని, కాంగ్రెస్ కబంధహస్తాల నుండి రాష్ట్రాన్ని విడిపించే ఈ పోరాటంలో కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన గులాబీ సైనికులకు పార్టీ తప్పకుండా బంగారు బాటలు వేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.

Next Story