‘దానం నాగేందర్ మా ఎమ్మెల్యే’: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఇబ్రహీం నగర్‌లోని బస్తీ దవాఖాన(Basti Dawakhana)కు కేటీఆర్(KTR) పరిశీలించారు.

‘దానం నాగేందర్ మా ఎమ్మెల్యే’: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఇబ్రహీం నగర్‌లోని బస్తీ దవాఖాన(Basti Dawakhana)కు కేటీఆర్(KTR) పరిశీలించారు. బస్తీ దవఖానను సందర్శించి పేషెంట్‌ల సమస్యలపై ఆరా తీశారు. గతంలో ప్రజలకు, ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాము. వాటితో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తేచ్చామని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టారు, బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్తీ దవాఖానాలను పరిశీలించారు. నాలుగు నెలలుగా బస్తీ దవాఖానాలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. బస్తీ దవాఖానాలలో 108 రకాల మందులు అందుబాటులో ఉండాలి, కానీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలు కూడా కాంగ్రెస్ పాలనలో పడకేశాయి. గత ప్రభుత్వం కేసీఆర్(KCR) ఆధ్వర్యంలో పేదల కోసం నాలుగు 'టీమ్స్' (TIMS) వెయ్యి పడకల ఆసుపత్రులను ప్రారంభించింది.

2000 పడకలతో నిమ్స్ (NIMS) విస్తరణను ప్రారంభించాం. 90 శాతం పనులను మా ప్రభుత్వమే పూర్తి చేసింది, కానీ ఈ ప్రభుత్వం 10 శాతం పనులు కూడా పూర్తి చేయడం లేదు. ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీనితో అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలో కనీసం పారిశుధ్య నిర్వహణ కూడా చేయడం లేదు. కనీసం హైదరాబాద్ నగరంలో చెత్త ఎత్తేవారు దిక్కు లేకుండా పోయారు. దీంతో దోమల బెడద పెరిగి, ప్రజలు తీవ్రమైన విష జ్వరాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 'దున్నపోతు ప్రభుత్వాన్ని' నిద్ర నుంచి మేల్కొల్పాలి. వెంటనే బస్తీ దవాఖానాలతో పాటు పారిశుధ్య నిర్వహణ పైన దృష్టి సారించాలి. మేము 450 బస్తీ దవాఖానాలను పెట్టాము, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మరో 450 దవాఖానాలు పెట్టాలి. టీమ్స్ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేసి, ప్రజల వినియోగంలోకి తీసుకురావాలి. లేకుంటే త్వరలో టీమ్స్ ఆసుపత్రుల వద్ద ధర్నా చేస్తామని కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ విమర్శలు చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా వచ్చింది?. ఆయన ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో చేరారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతి లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు, తాము ఏ పార్టీలో చేరామో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అవినీతి కరప్ట్ కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులుగా ఉన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు చేరలేదని చెప్తూనే, సిగ్గు లేకుండా మా పార్టీ ఎమ్మెల్యే పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ చేర్చిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

Next Story