KTR: అన్ని రంగాల్లో తెలంగాణ తిరోగమనం

by Gantepaka Srikanth |

రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తీసుకుపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: అన్ని రంగాల్లో తెలంగాణ తిరోగమనం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తీసుకుపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని, అందుకే హైదరాబాద్ నగరంలో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని పతనానికి పడగొట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికి 'హైడ్రా' నుంచి మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్, మరియు టీడీఆర్ (TDR) పేరిట మరొక స్కామ్, ఇలా ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం, రేవంత్ రెడ్డి 24 నెలలుగా చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం నెలకొని ఉన్నదని, నగరంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు అన్ని తిరిగి రాష్ట్ర రాజధానిలో దర్శనమిస్తున్నాయని, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యం..

రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యంతో, అక్రమ సంపాదనే లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇతర దేశాలకు ఎక్కడకు వెళ్లినా హైదరాబాద్ గురించి మాట్లాడకుండా, కేవలం తన స్వప్రయోజనాల కోసం ఫ్యూచర్ సిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఉన్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన చేయకుండా, కనీస పౌర సేవలు అందించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలోకి తీసుకువెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామన్నారు. కరెంట్ కోతలు లేకుండా, తాగునీరు, పారిశుధ్యం నుంచి మొదలుకొని ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే ప్రజలు రెండు సార్లు రాష్ట్ర రాజధానిలో మేయర్ పీఠాన్ని మా పార్టీకి కట్టబెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలో సొంతంగా మేయర్ పీఠం పైన గులాబీ జెండాను ఎగురవేశామని కేటీఆర్ గుర్తు చేశారు.

నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం..

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలతో, అవినీతితో పట్టణాన్ని పూర్తిగా పండబెట్టిందని, తెలంగాణ ఆర్థిక ఇంజన్‌ను కూలగొట్టి, నగరంలో రియల్ ఎస్టేట్‌ను, నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చిందన్నారు. ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్, జీహెచ్‌ఎంసీ (GHMC) నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలు వంటి వాటిని విస్తృతంగా కేటీఆర్ చర్చించారు. పార్టీ పరంగా అటు ప్రభుత్వం పైన చేయాల్సిన పోరాటానికి సంబంధించిన అంశంలో కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల కోసం కేంద్ర పార్టీ కార్యాలయం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు GHMC పార్టీ కార్యక్రమాలను, నాయకులకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం ఫాలోఅప్ కోసం జీహెచ్‌ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మరియు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజిగిరి కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు.

Next Story