- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ఈ పాపం వెంటాడుతూనే ఉంటుంది
హైదరాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీని ఏకంగా రూ.10 పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులు గుల్ల అవుతాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీని ఏకంగా రూ.10 పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులు గుల్ల అవుతాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం దుర్మార్గమని విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఈ చార్జీల పెంపు పిడుగులాంటిదని తెలిపారు. ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపితే, బడుగుజీవులు, దినసరి కూలీలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం రేవంత్‌రెడ్డి అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని వాసుల నడ్డివిరిచేలా నిత్యం దాదాపు కోటి రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్న సీఎంకు హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు స్పష్టమవుతున్నదని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారనే కసితోనే రేవంత్‌రెడ్డి ఈ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. తుస్సుమన్న ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ సంస్థను దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిదని పేర్కొన్నారు. ఈ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రగతి రథచక్రాలే కాకుండా ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు సైతం ధ్వంసం అయ్యాయని.. కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చే వరకూ ఈ పాపం వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.






