సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అంగీకరించం: తలసాని శ్రీనివాసయాదవ్

by Vemula.Srinu Prasad |

తాము డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉచితంగా ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 లక్షలు తీసుకొని సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని అంటున్నదని.. సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు...

సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అంగీకరించం: తలసాని శ్రీనివాసయాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాము డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉచితంగా ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 లక్షలు తీసుకొని సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని అంటున్నదని.. సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నిర్మించారని.. అత్యంత విలువైన ప్రాంతాల్లో పేద వాళ్లకు ఇళ్లు కట్టించామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 30 నెలలైనా హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లు కట్టిన పరిస్థితి లేదన్నారు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం మాటలకే పరిమితం అయిందని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇళ్లు కడతామని మంత్రులు హడావుడి చేస్తున్నారని.. ఇందిరమ్మ స్కీం ద్వారా రూ.6 లక్షలు లబ్ధిదారులు ఇవ్వాలని ప్రభుత్వం అంటున్నారని.. ప్రభుత్వం బోగస్ మాటలు మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే స్వాగతిస్తామని.. కానీ పేదలకు ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేద వాళ్లకు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ఖాళీగా ఉన్న 39 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్న సిటీకి దిక్కు లేదు కానీ ఫోర్త్ సిటీ అంటున్నారని.. ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు కడతామని సీఎం మాత్రం ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే సీఎం రేవంత్‌రెడ్డికి సన్మానం చేస్తామన్నారు. ఈ సమావేశంలో విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, డాక్టర్ దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు.

Next Story