అనారోగ్యకరమైన పేగులకు సంకేతాలు ఇవే..

by Sujitha Rachapalli |

తరచూ కడుపులో ఉబ్బరం, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? శరీరంలోని 70% రోగనిరోధక వ్యవస్థ గట్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రేగుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు శరీరం హెచ్చరికలు అందిస్తుంది.

అనారోగ్యకరమైన పేగులకు సంకేతాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : తరచూ కడుపులో ఉబ్బరం, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? శరీరంలోని 70% రోగనిరోధక వ్యవస్థ గట్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రేగుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు శరీరం హెచ్చరికలు అందిస్తుంది. ఇవి కూడా ఇందులో భాగమే కాగా మరిన్ని సంకేతాల గురించి వివరిస్తున్నారు నిపుణులు. గట్ హెల్త్ పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సంకేతాలేంటి? చూద్దాం.

1. కడుపు సమస్యలు

కడుపులో ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట, అతిసారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తరచుగా రావడం మంచిది కాదు. ఆహారం జీర్ణం కాకపోవడం లేదా వ్యర్థాలను బయటకు పంపడంలో ఇబ్బంది.. గట్ అనారోగ్యానికి మొదటి సంకేతంగా చెప్తున్నారు నిపుణులు. ఆహారం అసహనం.. అంటే ఫుడ్ టోలరెన్స్.. కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవడం, లేదా మూడ్ స్వింగ్స్, ఆందోళన వంటివి కూడా ఇందులో భాగమే.

2. నిద్ర సమస్యలు

గట్ హెల్త్ దెబ్బతిన్నప్పుడు ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది. నిద్ర పోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. గట్‌లోని బ్యాక్టీరియా అసమతుల్యత వల్ల సెరటోనిన్ ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. నిద్ర, మూడ్‌ను నియంత్రించే హార్మోన్.. నిద్ర సమస్యలు, అలసటకు దారితీస్తుంది.

3. బరువులో మార్పు

ఆహారం లేదా వ్యాయామం మార్చకుండానే ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత వల్లనే ఇలా జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.

4. చర్మ సమస్యలు

ఆకస్మికంగా వచ్చే అలర్జీలు, ఎక్జిమా లేదా చర్మపు చికాకులు కూడా ప్రేగుల అనారోగ్యం కారణంగానే వస్తాయంటున్నారు నిపుణులు. గట్ ఆరోగ్యం చర్మంపై కూడా ప్రభావం చూపుతుందని.. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

గట్ ఆరోగ్యం మెరుగుపరచడం ఎలా?

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం.. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి, ప్రోబయోటిక్స్ (పెరుగు, కిమ్చి), తగినంత నీరు తాగడం, స్ట్రెస్ తగ్గించడం, వ్యాయామం చేయడం మంచిది.

లక్షణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.

నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. వ్యక్తిగత సలహా కోసం వైద్యుడిని సంప్రదించండి.

Next Story