- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS కార్యకర్తల్లో ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది: KTR
ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చి ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అంతానికి ఆరంభం మొదలైందని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చి ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అంతానికి ఆరంభం మొదలైందని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో హైదరాబాద్‌లో కేటీఆర్ సమావేశం అయ్యారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవాలనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్‌తో రాష్ట్ర అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందని చెప్పారు. రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందన్నారు. నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగా నోటిఫికేషన్లు ఇవ్వడంతోపాటు ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజలను మోసం చేస్తూ, వేధిస్తుంటే ఊరుకోబోమన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటాలకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభ
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎల్కతుర్తి మీటింగ్ నిలిచిపోతుందని కేటీఆర్ చెప్పారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్తకు, నేతకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని స్పష్టం చేశారు. ‘ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువు బీఆర్‌ఎస్సే. సభ తరువాత ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం కలిగింది’ అని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారు. పార్టీ 25 ఏళ్ల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభ నిర్వహణలో భాగం అయిన నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.






