- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌ను చూస్తే జాలేస్తున్నది.. అందులో ఒక్క ప్రశంస కూడా లేదు: కేటీఆర్
సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్‌రెడ్డికి అస్కార్ అవార్డు కాకుండా భాస్కర్ అవార్డు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్‌రెడ్డికి అస్కార్ అవార్డు కాకుండా భాస్కర్ అవార్డు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను బీఆర్ఎస్వీలో విలీనం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సోనియా గాందీ ఇచ్చిన లెటర్‌లో ఏముందో రేవంత్‌కు తెలియదు. కనీసం లెటర్ చదివే తెలివిలేదు. అందుకే.. రేవంత్ తనకుందంటున్న డిగ్రీ సర్టిఫికెట్ దొంగ డీగ్రీ అని అనుమానం వస్తున్నది. ఆ లెటర్‌లో ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసిపోయిండు. సోనియా గాంధీ తనకు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని.. చదువు రాక పరవశించి పోతున్నాడు. రేవంత్.. కార్యక్రమానికి రాలేకపోతున్న అని సోనియా రాసిన లేఖలో ఉంది. ఒక్క మాటకూడా ప్రశంస లేనే లేదు. కార్యక్రమానికి రాలేను అన్న సోనియా మాటలే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పుకుంటున్నారు. రేవంత్‌ను చూస్తే జాలేస్తున్నది’ అని విమర్శించారు.
తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్న రేవంత్‌రెడ్డిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి విమర్శించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ స్పందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలాగా మారిందని చెపుతున్న అమిత్ షా.. కేంద్ర హోంమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని నిరూపించే సాక్ష్యాలను కేంద్రప్రభుత్వానికి ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ పార్టీలు నిస్సిగ్గుగా సాగిస్తున్న అక్రమ సంబంధానికి తిరుగులేని సాక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డికి బిజెపి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటే ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల మద్దతు ఏమాత్రం లేదన్నారు.
సీఎం రమేశ్‌కు రూ.1,600 కోట్ల కాంట్రాక్ట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో రేవంత్‌రెడ్డికి సపోర్ట్ చేసి కమీషన్లు ఇప్పిచ్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు క్విడ్ ప్రో కో కింద రూ.1,600 కోట్ల ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును అప్పజెప్పారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి వందల కొద్ది కాంట్రాక్టులు ఇస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు నల్లమల్ల పిల్లి ఉంటే.. తమకు నల్గొండ పులి జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నల్లమల్ల పిల్లికి నల్లమల్ల ఎక్కడుందో కూడా తెలియదన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో దళిత బిడ్డ సాయిలును రేవంత్‌రెడ్డి పోలీసులు ఎక్కడ అవమానించారో అక్కడనే ఇవాళ తామందరం ఆయనకు సన్మానం చేసి అధికారులకు హెచ్చరిక చేశామన్నారు. ఈ శతాబ్దం అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని అన్నారు. ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని.. కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు జరిపిన ఉద్యోగాలకు రేవంత్‌రెడ్డి ఆఫర్ లెటర్లు ఇస్తూ తానే ఇచ్చానని గప్పాలు కొట్టుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్‌కు ఇక చెప్పుల దండలే..
బస్తా ఎరువు కోసం రైతుల బతుకు సీఎం రేవంత్‌రెడ్డి బరువు చేశారని.. క్యూలైన్లలో చెప్పులు పెట్టాల్సిన దుస్థితి కల్పించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు. నేడు క్యూలో ఉన్న ఆ చెప్పులే కాంగ్రెస్ ప్రభుత్వానికి దండలా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే.. ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయమని హెచ్చరించారు. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యమని పేర్కొన్నారు.






