KTR: ఇది కదా ముందు చూపు అంటే! వారి పతనం ప్రారంభమైంది: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఇది కదా ముందు చూపు అంటే.. కేసీఆర్‌కు ఉన్న ఈ ముందుచూపు, దక్షత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం రైతులను కష్టాల పాలు చేస్తోందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.

KTR: ఇది కదా ముందు చూపు అంటే! వారి పతనం ప్రారంభమైంది: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రైతులకు యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను అరిగోస పెడుతున్న (Congress) కాంగ్రెస్ పాలకుల పతనం ప్రారంభమైందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన అంటే ఏమిటో తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ఆవేదన చెందారు. కేసీఆర్‌ నాయకత్వం, ముందుచూపు, పకడ్బందీ పాలన అంటే ఏమిటో ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు. చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ధ్వజమెత్తారు. ఒకవైపు బూతులు మాట్లాడటం తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు, మరోవైపు 'వందేళ్ల విజన్‌కు నిలువెత్తు రూపమైన కేసీఆర్‌కి' ఉన్న స్పష్టమైన తేడా నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్థమైపోయిందని తెలిపారు.

కేసీఆర్ (KCR) హయాంలో యూరియాను సకాలంలో తెప్పించడానికి ఎన్నెన్ని ప్రణాళికలు, కసరత్తులు జరిగాయో ఆయన వివరించారు. వ్యవసాయ అధికారులతో కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహించేవారని, కేంద్రానికి ప్రతి సీజన్‌కు ముందే లెక్కలతో సహా వినతులు సమర్పించేవారని గుర్తు చేశారు. అంతేకాకుండా, ఏపీలోని నౌకాశ్రయాలకు మన అధికారులను పంపి, సరఫరాను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసేవారని తెలిపారు. యూరియా సరఫరా కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి, 25 స్పెషల్ గూడ్స్ ట్రెయిన్‌లను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేవారని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఏ ప్రాంతంలోనూ కొరత రాకుండా, నేరుగా గ్రామాల్లోనే సరఫరా చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసేవారని ఆయన స్పష్టం చేశారు. ఇది కదా ముందు చూపు అంటే.. కేసీఆర్‌కు ఉన్న ఈ ముందుచూపు, దక్షత (Congress government) కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం రైతులను కష్టాల పాలు చేస్తోందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.

Next Story