KTR: గ్రూప్-1 లో అవకతవకలకు గట్టి చెంపదెబ్బ.. నిరుద్యోగులకు న్యాయం : తీర్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-09-09 10:42:04  IST  )

టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: గ్రూప్-1 లో అవకతవకలకు గట్టి చెంపదెబ్బ.. నిరుద్యోగులకు న్యాయం : తీర్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (TSPSC) టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. హైకోర్టు తీర్పు నిజంగా హర్షించదగినది.. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, టీఎస్పీఎస్సీ మొండిగా వ్యవహరించిందన్నారు. నిరుద్యోగుల ఆరోపణలను, వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయిందని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులు లేవనెత్తిన ఏ అంశాన్ని పట్టించుకోకుండా వారి పైన కేసులు పెట్టి, అణచివేత, లాఠీఛార్జీలకి గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు.

నేడు హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులకు న్యాయం జరిగిందని, ఇది ముమ్మాటికీ గ్రూప్-1 బాధితుల అలుపెరగని పోరాటానికి దక్కిన గెలుపు అని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్షా ఫలితాల్లోని అక్రమాల వంటి అనేక ఆరోపణలను, సాక్షాదారులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ కోర్టు తీర్పునకు మీ సమాధానం ఏంటి? హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడిన మీ నిర్లక్ష్య వైఖరికి నేడు విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్షల్లోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన బాధితులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అత్యంత కీలకమైన గ్రూప్-1 ఉద్యోగాలను అంగట్లో సరుకు మాదిరిగా అమ్ముకోవాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల స్వార్థానికి హైకోర్టు తన తీర్పు ద్వారా అడ్డుకట్ట వేయడం చారిత్రక నిర్ణయమని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 8 నెలల లోపు రీ-వాల్యుయేషన్ లేదా రీ-మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మళ్లీ అప్పీల్స్, కోర్టు కేసులు అంటూ యువతకు అన్యాయం చేయవద్దని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. విద్యార్థులు డిమాండ్ చేస్తున్న తీరుగా వెంటనే గ్రూప్-1 పరీక్షలను తిరిగి నిర్వహించి వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ కోరారు.

Read More: హరీశ్‌రావు మానసిక స్థితి బాగోలేదు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్

Next Story