కేటీఆర్ అరెస్టు అనివార్యం..! ఫార్ములా ఈ-కార్ రేసులో బిగుస్తున్న ఉచ్చు

by Kema Shiva Kumar |

ఫార్ములా ఈ కార్ రేసు కేసు చివరి అంకానికి చేరుకున్నదా..?

కేటీఆర్ అరెస్టు అనివార్యం..! ఫార్ములా ఈ-కార్ రేసులో బిగుస్తున్న ఉచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేసు కేసు చివరి అంకానికి చేరుకున్నదా..? ఈ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా..? ఆయన అరెస్టు తప్పదా? అంటే తాజా పరిణామాలను చూస్తుంటే అదే అర్థం అవుతున్నది. ఇందులో భాగస్వాములైన అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేయడంతో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతున్నది.

అంతా కేటీఆరే?

గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ఆయన హయాంలోనే 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లు చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ కారు రేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ అరవింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ విచారించింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలనే తాము పాటించామని వెల్లడించారు. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్టు విచారణలో అధికారులు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా కేటీఆర్‌ను ఏసీబీ రెండు పర్యాయాలు ఎంక్వయిరీ చేసింది. విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించానని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ, ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎక్కడా జరగలేదని చెప్పారు. నిబంధనలు తనకు తెలియదని.. అదంతా అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

అరెస్టు తప్పదా?

ఈ కేసులో ముందు నుంచీ కేటీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తున్నది. విచారణ పూర్తిచేసిన ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను విజిలెన్స్‌కు అందించగా.. అధికారులను బాధ్యులుగా తేల్చింది. ఆ రిపోర్టును సీఎస్‌కు అందించింది. ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతున్నది. అధికారులతో పాటే కేటీఆర్ అరెస్ట్ సైతం ఉంటుందన్న టాక్ నడుస్తున్నది. మరోవైపు.. ప్రభుత్వం అడుగులు సైతం అరెస్ట్ వైపే అన్నట్లుగా సమాచారం.

గవర్నర్ వద్దే పెండింగ్

ఏసీబీ నివేదిక ఆధారంగా కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్‌కు నివేదికను పంపించింది. ఈ అంశంపై గవర్నర్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. తాజాగా.. విజిలెన్స్ నుంచి అధికారులపై చర్యల కోసం సిఫారసు చేయడంతో గవర్నర్ సైతం ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు గవర్నర్ ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అటు పార్టీలో.. ఇటు ఆయన అభిమానుల్లో కొనసాగుతున్నది.

అధికారులపై చర్యలు తీసుకోండి.. విజిలెన్స్ సిఫారసు

ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, హెచ్ఎండీఏ మాజీ కమిషనర్ అరవింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో క్విడ్ ప్రో జరిగిందని ఏసీబీ తేల్చింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ఆ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ విభాగానికి అందించింది. దానిని పూర్తిస్థాయిలో స్టడీ చేసిన విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Next Story