కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం.. దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్ హెచ్చరిక

by Ramesh Naini |

సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు.

కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఉపేక్షించం.. దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్, బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లాడర్ దెబ్బతిన్నదని డాక్టర్లు తెలిపారు. ఆమెకు మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా.. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు.. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదని హెచ్చరించారు. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని చెప్పారు. గాయపడిన భారతి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవుపలికారు.

Next Story