KTR: ముట్టుకుంటే మసైపోతావ్.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్

by Ramesh Naini |   (  Updated:2025-08-05 08:28:34  IST  )

‘ముట్టుకుంటే మసైపోతావ్’ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

KTR: ముట్టుకుంటే మసైపోతావ్.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ముట్టుకుంటే మసైపోతావ్’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ వాసులకు కేసీఆర్ (KCR) అందించిన (free drinking water scheme) ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే.. అంటూ కేటీఆర్ హెచ్చరించారు. 20 నెలలు కావస్తున్నా.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహా పాపాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేస్తే.. మహానగరంలోని కోటి 20 లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌ను క్షమించరని తెలిపారు.

రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆరోపించారు. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రగతి ప్రస్థానంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేని రాజధాని వాసులకు మళ్లీ కరెంట్ కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్ దే అని తెలిపారు. ఓవైపు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇంకోవైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఫ్రీ వాటర్ స్కీమ్ ను కూడా గండి కొట్టాలని చూస్తున్న రేవంత్‌కు కర్రు కాల్చి పెట్టేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.

Next Story