- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది ఆరంభం మాత్రమే.. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
ఇది ఆరంభం మాత్రమే, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇది ఆరంభం మాత్రమే, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరా హోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు అంటూ పేర్కొన్నారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువై పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయని అన్నారు.
వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని వెల్లడించారు. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతోందన్నారు. రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయన్నారు.
యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పండించిన పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో రెండేళ్లుగా పడకేసిన పాలన, గాడితప్పిన పారిశుధ్యం, చివరికి ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేసినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.






