రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్‌.. ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్‌లో తీవ్ర ఉత్కంఠ

by Ramesh Naini |

ఫార్ములా ఈ-రేసింగ్‌ (Formula E-Car Race) కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)కు (ఏసీబీ) అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్‌.. ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్‌లో తీవ్ర ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా ఈ-రేసింగ్‌ (Formula E-Car Race) కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)కు (ఏసీబీ) అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్ రేపు విచారణకు హాజరు కానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా మే 26వ తేదీన హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉండటంతో తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, రేపటి విచారణలో ఏం జరుగుతుందోనని (BRS) బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

కాగా, ఫార్ములా ఈ-కారు‌ రేసు ఫండ్స్‌పై దర్యాప్తు వేగం పెంచినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్‌ రేస్‌లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీలో కేసు నమోదు అయింది. ఈ కేసులో కేటీఆర్‌ ఏ -1గా ఉన్నారు. ఇప్పటికే జనవరిలో కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. కేసులో ఏ -2గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్, ఏ-3గా ఉన్న హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఇదివరకే ఏసీబీ అధికారులు విచారించారు. తాజాగా కేటీఆర్‌ను మరోసారి ఏసీబీ ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రజల తరపున పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోడానికి 14 కేసులు పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Next Story