KTR: ఎస్‌ఎల్‌బీ‌సీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎందే.. కేటీఆర్ సంచలన ట్వీట్

by Kema Shiva Kumar |

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌ (Srisailam Left Canal) టన్నెల్‌ పనులు కొనసాగుతోన్న వేళ 14వ కి.మీ మైలురాయి వద్ద సుమారు 3 కి.మీ మేర పైకప్పు కుప్పకూలింది.

KTR: ఎస్‌ఎల్‌బీ‌సీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎందే.. కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌ (Srisailam Left Canal) టన్నెల్‌ పనులు కొనసాగుతోన్న వేళ 14వ కి.మీ మైలురాయి వద్ద సుమారు 3 కి.మీ మేర పైకప్పు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఐదుగురు కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల (Sunkishaala)లో రీటైనింగ్ వాల్ (Retaining Wall) కుప్పకూలిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు (Congress Government) వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేశారని ఆరోపించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోవడం వల్లే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయంటూ దుయ్యబట్టారు.

ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగంగా ఓ బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతోన్న వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్‌ను కాపాడేందుకు వాస్తవాలు దాచిన ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్‌బీసీ (SLBC) ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలి.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story