- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యేక ఓటర్ల సవరణపై అప్రమత్తంగా ఉండాలి.. కేటీఆర్, తలసాని కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ను పక్కన పెట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి తీసుకువస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ను పక్కన పెట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి తీసుకువస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో జరిగిన సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాధారణంగా జరిగే ఈ ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా అనేక వివాదాలు సృష్టించిందని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓటర్లను, వారి మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఈ ఎస్.ఐ.ఆర్ ను అడ్డగోలుగా వినియోగిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో ఆ పార్టీ ఆటలు సాగకుండా, అరాచకాలు నడవకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన గాలి గత్తరతో కొంత కనిపిస్తోందన్నారు. కేవలం సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ ఉన్న పార్టీ బిల్డప్ తప్పించి ఇంకేమీ ఉండదన్నారు. కేవలం ఒకరిపైన ఒకరికి ఉసిగొల్పాలన్న ఆలోచనలోనే ముందుకు పోతుందని మండిపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించేలా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల వ్యవహారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎదురైన ఇబ్బందులను, ఓటమిని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్న కూల్చివేతలు చేస్తోందని, నగరంలో కనీసం తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ వంటి అంశాలను కూడా నిర్వహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నారు. గ్రేటర్నగరంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి పార్టీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ముందుకు పోతున్నారని, ఆయన రాజకీయాలతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరుపై ప్రశంసలు కురిపించారు. అందరికన్నా ముందుగా ఎస్.ఐ.ఆర్ పైన పకడ్బందీగా నిర్వహించిన కార్యక్రమం పట్ల ప్రశంసించారు.
కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి : తలసాని
రాష్ట్రంలో త్వరలో జరిగే ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సర్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రకాల విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీకి చెందిన నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరణించిన ఓటర్లను జాబితా నుండి తొలగించడం 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా చేర్చడం జరుగుతుందని చెప్పారు. సనత్ నగర్ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలకు చెందిన వారు వచ్చి స్థిరపడి ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. సర్వే కార్యక్రమంలో ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ను పార్టీ శ్రేణులు తీసుకోవాలన్నారు. జూన్ 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ, అత్తిలి అరుణ గౌడ్, టి. మహేశ్వరి, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.






