KTR: రేవంత్ తన పాత గురువును అడిగి తెలుసుకుంటే మంచిది! కేటీఆర్ కీలక సూచన

by Ramesh Naini |

యూరియా సంక్షోభాన్ని తన చేతకానితనంతో సృష్టించిన రేవంత్‌పై కోపాగ్నితో రగిలిపోతున్న లక్షలాది రైతులపై కేసులు పెట్టే దమ్ము ఈ సర్కారుకు ఉందా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

KTR: రేవంత్ తన పాత గురువును అడిగి తెలుసుకుంటే మంచిది! కేటీఆర్ కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూరియా సంక్షోభాన్ని తన చేతకానితనంతో సృష్టించిన (CM Revanth Reddy) రేవంత్‌పై కోపాగ్నితో రగిలిపోతున్న లక్షలాది (Farmers) రైతులపై కేసులు పెట్టే దమ్ము ఈ సర్కారుకు ఉందా ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని (Yellareddypet) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెల్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా ? అని నిలదీశారు.

యూరియా (Urea) దొరకక కళ్లముందే పంట ఎండిపోవడంతో ఆక్రోశంలో మాట్లాడిన రైతుపై కక్షగట్టి అర్థరాత్రి నుంచి పోలీసులను అతని ఇంటిపైకి పంపించి రైతు లక్ష్మణ్‌ను అతని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు. దేశానికే అన్నం పెట్టే రైతుపై ఈ రకంగా అక్రమంగా కేసు బనాయించడం దుర్మార్గమైన చర్యే కాదు.. సీఎం దిగజారుడుతనానికి కూడా నిదర్శనమని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో బస్తా యూరియాకు దిక్కులేక అల్లాడుతున్న అన్నదాతలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? రాజ్యాంగాన్ని పట్టుకుని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పల్లెపల్లెనా ఈ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్న రైతులందరిని అరెస్టు చేయడానికి ఈ పోలీసులు సరిపోవని, రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు. కడుపు కాలిన తెలంగాణ రైతులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి, తన పాత గురువును అడిగి తెలుసుకుంటే మంచిదన్నారు. ఇకనైనా ఈ అక్రమ కేసులు బనాయించి అమాయక రైతు లక్ష్మణ్‌ను వేధించడం మానుకోకపోతే, అతనికి రక్షణ కవచంగా బీఆర్ఎస్ ఉంటదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్నదాతలను బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటదని భరోసా ఇచ్చారు.

Next Story