రాష్ట్రంలో రాజ్యమేలుతున్న మాఫియా.. నెక్స్ట్ ఎగిరేది గులాబీ జెండానే : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నడవడం లేదని.. మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రాజ్యమేలుతున్న మాఫియా.. నెక్స్ట్ ఎగిరేది గులాబీ జెండానే : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నడవడం లేదని.. మాఫియా మాత్రమే రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. శుక్రవారం మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని.. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండా మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ ఎన్నికలొచ్చినా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కాలని పిలుపునిచ్చారు. జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలోనూ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే.. ఇక్కడి సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపాలిటీలపైనా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటం ఖాయమని వెల్లడించారు. తెలంగాణకు మళ్లీ మంచిరోజులు రావాలన్నా.. హైదరాబాద్ అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టాలన్నా అది బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు అంటున్నారని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా ముందుకు సాగాయని తెలిపారు. ట్రెయిలర్ చూస్తేనే సినిమా హిట్టో, ఫట్టో చెప్పే రోజులివి అని.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సగం సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. 30 నెలల్లో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. అడ్డగోలు హామీలిచ్చారని దుయ్యబట్టారు.

అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల పేరిట చేసిన మోసం రెండున్నరేళ్ల పాలనలో పూర్తిగా బట్టబయలైందని మండిపడ్డారు. వంద రోజుల్లోనే అన్నీ హామీలు అమలు చేస్తామని పంచిన గ్యారెంటీ కార్డుకు కాంగ్రెస్ సర్కారు పాతరేసిందని విమర్శించారు. గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన డిప్యూటీ సీఎం మాటలు నీటి మూటలయ్యాయన్నారు. గ్యారెంటీల సంగతి ఏమైందని సీఎంను ప్రశ్నిస్తే, గుడ్లు పీకి గోటీలు ఆడతా, పేగులు మెడలో వేసుకుంటా అని తిట్ల పురాణం అందుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి పేదల ఇళ్లు కూల్చుడు తప్ప, నిర్మాణాలు చేతకావని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ ఒక్క ఇటుక పేర్చకుండా నాలుగు లక్షల కోట్ల అప్పుచేశారని ధ్వజమెత్తారు. అప్పు చేసిన సొమ్ము ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరిట పేదల గుడిసెలు, ఇళ్లు కూల్చి వారిని రోడ్డున పడేసిన దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. మల్కాజిగిరిలో కార్యకర్తలెవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. గతంలో పార్టీ కార్యకర్తలను ముట్టుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం అండగా నిలబడ్డామని గుర్తుచేశారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరిపైనైనా అక్రమ కేసులు బనాయిస్తే దగ్గరుండి వారిని విడిపించే దాకా పార్టీ నాయకత్వం పోరాడుతుందని భరోసానిచ్చారు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఎస్ఐఆర్‌లో అర్హులైన ఓటర్లను తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేటీఆర్ కోరారు. పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ రూపంలో చేపట్టేందుకు మెంబర్ షిప్ యాప్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి అత్యంత సులభంగా మెంబర్‌షిప్ ప్రక్రియ చేపట్టేలా రూపొందించామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

Next Story