నీట్ రద్దు కేంద్రానికే సిగ్గుచేటు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు: కేటీఆర్ ఫైర్.

by Gantepaka Srikanth |

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

నీట్ రద్దు కేంద్రానికే సిగ్గుచేటు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు: కేటీఆర్ ఫైర్.
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దుచేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడింది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైంది. 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైంది. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది.

ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి. దీని వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story