KTR: NDSA రిపోర్ట్ కాదు.. అది NDA రిపోర్ట్.. కాళేశ్వరం తుది నివేదికపై కేటీఆర్

by Prasad Jukanti |

కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

KTR: NDSA రిపోర్ట్ కాదు.. అది NDA రిపోర్ట్.. కాళేశ్వరం తుది నివేదికపై కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) ఇచ్చిన తుది నివేదికపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. అది ఎన్డీఎస్ఏ (NDSA Report) రిపోర్టు కాదని అది ఎన్డీయే (NDA) రిపోర్టు అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిపి రాసిన నివేదిక అన్నారు. తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్.. మేడిగడ్డను చూడకుండానే, అక్కడ ఎలాంటి పరీక్షలు నిర్వహిచకుండానే ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిందన్నారు. గుజరాత్ లోని మార్బి లో సస్పెన్స్ వంతెన కూలిపోయి 141 మంది మరణిస్తే అక్కడ ఎన్టీఎస్ఏ అక్కడికి వెళ్లలేదు. బీహార్ లో రోజూ బ్రిడ్జ్ లు కూలుతున్నాయి. అక్కడ చర్యలు తీసుకున్నారా? సుంకిశాళ రిటర్నింగ్ వాల్ కూలిపోయింది. ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిపోయి 60 రోజులు అయినా ఇప్పటి వరకు వీటి వద్దకు రాని ఎన్డీఎస్ఏ ఒక రాజకీయ ఎజెండాతో కాళేశ్వరంలో పర్రెపడితే దాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికే ఈ రకమైన రిపోర్టు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏరకంగా పని చేస్తున్నాయో ఏందరికీ తెలుసన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు డిసెంబర్ లో వస్తే ఇప్పుడు సరిగ్గా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రెండు రోజుల ముందరా బయటకు తీస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ అస్త్రం:

కాళేశ్వరం (Kaleswaram) విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చాలా రోజులుగా డైలాగ్ వార్ సాగుతూ వస్తోంది. తెలంగాణలో నీటి సమస్యను తొలగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కాశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే అక్కడ జరిగిన చిన్న సమస్యను కాంగ్రెస్ పార్టీ బూతద్దంలో చూపిస్తోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరంలోని బ్యారేజీల్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారమ పీక్స్ కు చేరుకున్న తరుణంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు రావడం, తుది నివేదిక రావడం అందులో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నాణ్యత నిర్వహణలో లోపాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేయడం ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందేనని నివేదిక పేర్కొనడం రాజకీయంగా కారు పార్టీకి బిగ్ షాక్ అనే చర్చ జరుగుతోంది. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఇన్నాళ్లు ఈ నివేదిక కోసం చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నదని అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు ఈ నివేదికతో బీఆర్ఎస్, కేసీఆర్ కు మరిన్ని రాజకీయ చిక్కులు తప్పవనే చర్చ తెరపైకి వస్తోంది. ఈ నివేదికను బీఆర్ఎస్ పైకి ఓ అస్త్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకునే చాన్స్ ఉంది. మరి అధికార పార్టీ దాడిని కారు పార్టీ ఎలా అడ్డుకుంటుందో చూడాలి మరి.

Next Story