- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: రేవంత్ కోవర్టులంతా బయటపడతారు.. కవిత లేఖ దుమారం వేళ కేటీఆర్ హాట్ కామెంట్స్
కవిత లేఖ విషయంలో రచ్చ జరుగుతున్న వేళ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైనా అంతర్గత విషయాలు అంతర్గతంగ మాట్లాడితేనే మంచిదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుందని పార్టీలో అందరం కార్యకర్తలమే అందరూ సమానమేనన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ (KCR) కు కవిత (Kavitha) లేఖ విషయాన్ని మీడియా ప్రస్తావించగా కవిత పేరెత్తకుండా పరోక్షంగానే కేటీఆర్ స్పందించారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. మా పార్టీ నాయకులు ఎవరైనా తమ అధ్యక్షుడికి తమ సూచనలు, సలహాలను లిఖితపూర్వకంగా, నోటి మాటగా ఎలాగైనా ఇవ్వొచ్చన్నారు. పార్టీ అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉందని తమ సూచనలు పార్టీ అధిష్టానానికి తెలియజెప్పేందుకు పార్టీలో ఫోరమ్స్ ఉన్నాయి. పార్టీలో ఎవరైనా సరే ఇంటర్నల్ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుందన్నారు. ఉత్తరాలు రాయడం ఏదో గొప్ప విషయం ఏమి కాదన్నారు. అన్ని పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని మా పార్టీలోనూ కోవర్టులు ఉండవచ్చు అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులంతా బయటపడతారన్నారు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అన్నారు. ఈ రెండింటిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ అని చెప్పారు. అయితే కవిత లేఖ అంశాన్ని ప్రస్తావించిన మీడియాపై ఈ సందర్భంగా కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకో..
నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald Case) ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరు ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈడీ చార్జిషీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం తెలంగాణకు అవమానకరం అన్నారు. ఈ ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరగాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉంటే ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప ఉన్న సమయంలో ఆయనపై హౌసింగ్ సొసైటీ కుంభకోణం ఆరోపణలు వస్తే సీఎం రాజీనామా చేయాలని నాటి కర్ణాటక పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారని అందుకు తగ్గట్టుగా యడియూరప్ప తన పదవి నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అధిష్టానానికి డబ్బులు ఇస్తూ సీఎం పదవిని కాపాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు.. మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయిందన్నారు.
తెలంగాణ బీజేపీ నేతల మౌనం దేనికి?:
కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. రూ. 50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొన్నట్లు కాంగ్రెస్ వాళ్లే చెప్తున్నారని మూటలు మోసి రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకున్నారని కోమటిరెడ్డే అన్నారని ఇప్పుడు మూటలు మోసి పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బ్యాగ్ మాన్ అనే పేరు వచ్చిందని హాట్ కామెంట్స్ చేశారు. తనను తాను కాపాడుకోవడానికి ఢిల్లీ నేతల కాళ్లు రేవంత్ రెడ్డి పట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్ లు ఉన్నారని ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డిని నిందితునిగా చేరిస్తే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ కేసుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కర్ణాటకలో డీకే శివకుమార్ పై అక్కడి బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం మౌన మునుల్లా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చాన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందాలకు సీఎం వత్తాసు పలుకుతున్నందుకు ఈ మౌనమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ను కలిసి కోరుతామన్నారు. తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పై ప్రధాని మోడీ స్వయంగా ఆరోపణలు చేశారని మంరి ఎందుకు మోడీ విచారణకు ఆదేశించట్లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. రేవంత్ రెడ్డి అవినీతి విషయంలో బీజేపీ స్పందించి చర్యలు తీసుకోకపోతే నెల రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందన్నారు.






