KTR: అందుకోసమే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ.. చిట్ చాట్ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

క్రికెట్ లో కట్స్ కొట్టే అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి పెద్ద కట్ కొట్టారని కేటీఆర్ సెటైర్ వేశారు.

KTR: అందుకోసమే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ.. చిట్ చాట్ లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అజారుద్దీన్‍కు ఎమ్మెల్సీ పదవిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ (Azharuddin) ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని అనుకుంటున్నానని చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. అజారుద్దీన్ క్రికెట్‍లో బాగా కట్‍లు కొట్టేవారు, ఇప్పుడు హజరుద్దీన్‍కే పెద్ద కట్ కొట్టారని సెటైర్ వేశారు. అజారుద్దీన్‍ను సంతృప్తి పరిచేందుకు, ముస్లింల ఓట్ల కోసం ఎమ్మెల్సీ అని ప్రకటించారని విమర్శించారు. అజారుద్దీన్ త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారన్నారు.

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని సీఎంపై విమర్శలు గుప్పించారు. ఎల్ అండ్ టీ వారిని ముడుపుల కోసం రేవంత్ భయపెట్టారని సీఎం బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎల్ అండ్ టీ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‍ను జైల్లో పెడతా అన్నారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతామంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలే వస్తాయన్నారు. ఈ-కార్ రేస్ ఏసీబీ కేసులో ఏ-4 గా గ్రీన్ కో పై కేసు పెట్టలేదు. గ్రీన్ కో దగ్గర ముడుపుల కోసమే వారిపై కేసు పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటుందని నిలదీశారు. గతంలో అనేక వివాదాలు ఉన్న ఎమ్మార్ సంస్థ ఆస్తులను త్వరలోనే రేవంత్ రెడ్డి అమ్మ బోతున్నారని గత కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటురని ఆరోపించారు.

తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదని, గతంలో ప్రగతి భవన్ గురించి అనేక అబద్ధాలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి 'కుడితిలో ఎలుకల' మాదిరిగా మారిందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందన్నారు. ‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’ అయిందని, కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి మేకలు, గొర్రెల మాదిరిగా రేవంత్ రెడ్డి అమ్మేశారని ఆరోపించారు. రానున్న సంవత్సర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వరుసగా వస్తాయని, కనీసం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా ఉందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల పైన తీర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Next Story