- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి బినామీ సీఎం.. డైవర్షన్ కోసమే సిట్ విచారణ : కేటీఆర్ సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డి ఒక బినామీ చీఫ్ మినిస్టర్ అని, వేరే వాళ్ల కోసం ఆయన ఇక్కడ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి ఒక బినామీ చీఫ్ మినిస్టర్ అని, వేరే వాళ్ల కోసం ఆయన ఇక్కడ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన వెనక ఉండి నడిపించేవాళ్లు వేరే ఉన్నారని, ఆధారాలతో సహా వాటిని బయటపెడతానన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నోటీసులతో KLSR బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు.
దివాళా తీసిన కంపెనీకి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులు
2018లోనే ఆ కంపెనీపై ఐటీ దాడులు జరగ్గా 2023లో ఆ కంపెనీ దివాళా తీసిందన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వాడుతున్న సొంత కారు కూడా KLSR ఇన్ఫ్రా టెక్ కంపెనీ పేరుమీదే ఉందని కేటీఆర్ తెలిపారు. కంపెనీలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేని సంస్థకు రేవంత్ రూ.6 వేల కోట్ల టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. KLSR సాక్షాత్తూ రేవంత్ బినామీ కంపెనీ అని, రెండేళ్లుగా ఆయన దొడ్డిదారిన ఆ కంపెనీకి తన అక్రమ సంపాదనను మళ్లిస్తున్నారన్నారు. సీఎం సీట్లో కూర్చొని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, ఇంకా అనేక ప్రాజెక్టుల కాంట్రాక్ట్ లను ఆ కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ ప్రధానంగా ఆరోపించారు. దివాళా తీసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ అవకతవకలపై CBI/SFIO/ED ఏదైనా ఒక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జనవరి 23న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని నుంచి డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు.
డైవర్షన్ కోసమే సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా సిట్ విచారణ చేస్తుంటే తమకు అనుమానం వచ్చి ఆరా తీస్తే.. ఈ విషయాలన్నీ తెలిశాయని కేటీఆర్ తెలిపారు. అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్.. ఇలా మొత్తం రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చినట్లు KLSR అధికారిక వెబ్ సైట్లో పేర్కొందన్నారు. మెదక్ ఆర్ అండ్ బీలో సుమారు రూ.116 కోట్లు, షాద్ నగర్ - పరిగి రోడ్డు రూ.130 కోట్లు, మోతే సూర్యాపేట కన్ స్ట్రక్షనల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూ.1910 కోట్లు, గణపవరం - కోదాడ రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూ.320 కోట్లు, కొడంగల్ వెటర్నరీ సైన్స్ న్యూ కాలేజ్ రూ.145 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ మిషన్ భగీరథలో రూ.168 కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. ఇలా రకరకాల దివాళా తీసిన KLSR కంపెనీకి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.
కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి
సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చి పదిరోజులైందని, ఇప్పటికైనా కేంద్రం వేగంగా స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది గుర్తు చేయాలనే ప్రెస్ మీట్ పెట్టామని కేటీఆర్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు తమపై చాలానే చేశారన్నారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా పూర్తిస్థాయి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఈ కుంభకోణం మీద, కె.ఎల్.ఎస్.ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, సిబిఐ, ఈడీ, ఎస్.ఎఫ్.ఐ.ఓ మూడింటినీ రంగంలోకి దింపి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.






