- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో:వక్ఫ్ సవరణ చట్టం 2025 పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బీఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని మేము ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. "వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన మేము పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి, ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు" అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ దేశంలోని మత సామరస్య వాతావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా దేశ ఐక్యత ముఖ్యమని తాము విశ్వసిస్తామని వివరించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు పూర్తి శక్తితో పోరాడారని, భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు పోరాడుతూనే ఉంటామన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మైనార్టీల సంక్షేమంలో గొప్ప పురోగతి సాధించిందని గుర్తు చేశారు. కేసీఆర్ పది పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు. ఇది మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన తెలిపారు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూసే ఎవరికైనా వ్యతిరేకంగా మేము పోరాడుతాం.. అని కేటీఆర్ తెలిపారు.






