రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్​ రైతుల పేరుతో డ్రామాలు : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-22 15:27:55  IST  )

రైతుల్లో గందరగోళం సృష్టించి అపోహలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్​ఎస్​నేత కేటీఆర్​కుట్రలు చేస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్​ రైతుల పేరుతో డ్రామాలు : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి
X
  • వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం మానుకోవాలి
  • ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతా బహిరంగమే
  • ప్రజా పాలనలో పారదర్శకంగా కొనుగోళ్ళు
  • బీఆర్​ఎస్ ​ పాలనలో మిల్లర్లతో కుమ్మకై దోపిడీ

దిశ, తెలంగాణ బ్యూరో : రైతుల్లో గందరగోళం సృష్టించి అపోహలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్​ఎస్​నేత కేటీఆర్​కుట్రలు చేస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. నిజాలు తెలుసుకోకుండా శవరాజకీయలు చేయడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందని, 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టింది చాలక అకస్మాత్తుగా రైతుల మీద ప్రేమ పొంగిపొర్లడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రైతుల పేరుతో ఆపార్టీ నేతలు ఆడుతున్నా డ్రామాకు పరాకాష్టకు చేరిందని, కేటీఆర్ చేసిన ప్రకటననే ఇందుకు అద్దం పడుతోందని విరుచుకుపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా ప్రవర్తిస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ల పై ఆయన చేస్తున్న అనుచితమైన ఆరోపణలు ఇందుకు నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించడంతో పాటు ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. కేంద్రాల ఏర్పాటు నుండి కొనుగోళ్ల ప్రక్రియ వరకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి అందిస్తున్నపుడు ఇక అనుమానాలకు ఆస్కారం ఎక్కడిదని కేటీఆర్ ను నిలదీశారు. వారి పాలనలో కేంద్రాలలో అవినీతికి పాల్పడి అక్రమాలు చేయడమే కాకుండా మిల్లర్లతో కుమ్మక్కై రైతాంగాన్ని నిలువు దోపిడీకి పాల్పడ్డ నేతలు ధాన్యం కొనుగోళ్ల పై మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. రైతుల మరణాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని ఎవరి మరణమైనా ప్రభుత్వానికి భాదకరమని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేసి సంచలనం సృష్టించేందుకే ఎత్తుగడలు వేసినట్లు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2023-24 రబీ సీజన్ లో రూ. 8691 కోట్ల విలువైన 39.51 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ. 6112 కోట్లు చెల్లించామన్నారు. 2024-25 రబీ సీజన్ల లో రూ. 14,010 కోట్ల విలువైన 60.44 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ. 10,882 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రస్తుత రబీ సీజన్ లో ఇప్పటి వరకు రూ. 11499 కోట్ల విలువైన 48.21 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ. 8,203 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. కేసీఆర్​పాలనలో రెండు రబీ సీజన్లతో పోలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా మూడు రబీ సీజన్లలో దాన్యం కొనుగోళ్ల ప్రక్రియను చెల్లింపులను వివరించారు. గన్నీ బ్యాగుల అంశంపై కేటీఆర్ కు అసలు అవగాహననే లేదని తనకు తాను గన్నీ బ్యాగుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి తన అవగాహన రాహిత్యాన్ని చాటుకున్నారని విమర్శించారు.

20 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉంచాం

రబీ సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం 11.29 కోట్ల కొత్త గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గర 5.93 కొట్లు అందుబాటులో ఉండగా ఏజెన్సీ నుండి తెప్పించిన 3.63 కోట్లతో కలిపి 20. 86 కోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో కొనుగోలు కేంద్రాలకు 14.12 కోట్లు సరఫరా చేయగా వాటిలో ఇప్పటికే 11.03 కోట్లు వినియోగించినట్లు తెలిపారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలలో 3.91 కోట్లు అందుబాటులో ఉండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపడానికి వీలుగా 32 జిల్లా కేంద్రాలలో 6.73 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచమన్నారు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నిస్తూ కేటీఆర్ చేసే వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నట్లుగా ప్రజలు అర్థమైతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వీలుగా 1300 వాహనాలను వినియోగిస్తున్నామన్నారు. దాన్యం కొనుగోలులో దిగుబడిలో దేశంలోనే తెలంగాణా నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇది తట్టుకోలేక కేటీఆర్ నీతిమాలిన ప్రచారానికి దిగుతున్నారని దుయ్యబట్టారు. రైతులను అయోమయంలోకి నెట్టి ఆడుతున్న రాజకీయ నాటకాలకు ముగింపు పలకాలని హితవు పలికారు. తప్పదోవ పట్టిస్తే ఆ దోవలో నడవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని మండిపడ్డారు.

Next Story