కాంగ్రెస్ అడ్డగాడిద.. రాష్ట్రానికి దరిద్రం

by velandi.Saikiran |

అడ్డదారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ అడ్డగాడిద.. రాష్ట్రానికి దరిద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడ్డదారిలో గద్దెనెక్కిన అడ్డగాడిద కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని.. తెలంగాణలో ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని అమాయకంగా నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని.. ఇప్పుడు నిజం తెలుసుకుని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఈ కాంగ్రెస్ దరిద్రానికి 50 శాతం టైం అయిపోయిందని.. రేవంత్‌ను చూసి కొన్ని రోజుల్లో కూర్చున్న కుక్క కూడా లేవదని ఎద్దేవా చేశారు. చిక్కడపల్లి లైబ్రేరీకి రాకుండా చిక్కడు దొరకడు అనేలా రేవంత్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. రైతుబంధు బంద్ అయ్యి రాహుల్ బంధు స్టార్ట్ అయ్యిందని.. పుష్కర తెలంగాణ ముష్కరుల చేతిలోకి వెళ్లిందన్నారు.

గత ప్రభుత్వంపై, కేసీఆర్‌పై చిల్లర ప్రచారాలు చేసి, అబద్ధాలతో కూడిన విష ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో 420 హామీల రూపంలో చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 25 ఏళ్ల వెనక్కి నెట్టిందని.. రేవంత్‌రెడ్డి వర్ణించిన విస్తరిలాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారని ఆరోపించారు. 30 నెలల్లో తెలంగాణను అన్ని రంగాల్లో కుప్పకూల్చిందని.. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదని అన్నారు. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపైనా కాంగ్రెస్ పగబట్టిందని.. కృష్ణా, గోదావరి జలాలను గురువుకు సంతార్పణ చేసే కార్యక్రమం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగగొట్టిన నయవంచకుడు రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో కనీసం 4వేల కొత్త ఉద్యోగాలు కూడా ఇయ్యలేదని.. సన్నాసి రాహుల్‌గాంధీ ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణకి రావడానికి మొహం చెల్లడం లేదా అని ప్రశ్నించారు.

దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్‌నగర్ చౌరస్తాకు వస్తావా..? పోలీసులు లేకుండా నిరుద్యోగ యువతను కలుస్తావా రేవంత్‌రెడ్డి అని సవాల్ విసిరారు. తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయిందన్నారు. అన్నివర్గాలు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఎవరికీ ఒక్క రూపాయి సైతం ఇవ్వకుండానే రేవంత్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. ప్రజలకు ఒక్క రూపాయి దక్కడం లేదు కానీ రాహుల్‌గాంధీ అకౌంట్లో మాత్రం టింగు టింగుమని నిధులు పడుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ ముక్తకంఠంతో కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని అంటున్నదని వెల్లడించారు. మన పోరాటం అధికారం కోసం కాదని.. తెలంగాణ కోసమని.. కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలవుతున్నదని.. తెలంగాణ తల్లి కిరీటాన్ని, తెలంగాణ తల్లి వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగతనం చేసుకొని పోతున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జానపద గాయకులను సన్మానించారు.

Next Story