రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించిండ్రు.. సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించిండ్రు.. సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా కాగ్ నివేదికతో రేవంత్ సర్కార్ బండారం బయపడిందంటూ ఇవాళ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మిగులు బడ్జెట్‌లో ఉండాల్సిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం పట్టించిందని ఫైర్ అయ్యారు. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టుకుండా అప్పులతో ఏం చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీగా ఖతం పట్టించిందని మండిపడ్డారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావించిన ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు.

అప్పుల్లో తెలంగాణ.. లోటు బడ్జెట్‌తో ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని కేటీఆర్ ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ నేడు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయిందని తెలిపారు.

నిధులు ఎటు పోతున్నాయ్..?

అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతి రోజూ అప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పుగా తీసుకుందని కేటీఆర్ తెలిపారు. వార్షిక లక్ష్యంలో ఇది 37.5 శాతం అన్న కేటీఆర్, కొత్తగా ఏ రోడ్లు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా.. ఆ నిధులను ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్‌లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story