- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోజే HCA భూములపై CM రేవంత్ కన్నేశాడు.. కేటీఆర్ హాట్ కామెంట్స్
ఆస్తులు అమ్మడం.. అప్పులు తేవడం.. ఇదే ఎజెండాపై సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్తులు అమ్మడం.. అప్పులు తేవడం.. ఇదే ఎజెండాపై సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతున్నదని అన్నారు. సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలువగా.. వారి పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలలో కడతామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని.. ఫార్మాసిటీ భూములతోపాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి కొత్త నగరం కడతామంటున్నారని.. ఇప్పటికే వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు ఈ భూములను అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 45,000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులో వచ్చే ఈ తరుణంలో 400 ఎకరాలపై ఎందుకు ఇంత దాష్టీకంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. అడ్డమొచ్చిన విద్యార్థులను ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి మరీ దుశ్శాసశానుడి మాదిరి వ్యవహరించి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెగబడుతున్నదని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడి మరీ అక్కడున్న భూములపై కన్నేశారని ఆరోపించారు. ఏమైనా సరే సెంట్రల్ యూనివర్సిటీ భూములు వదిలిపెట్టనని అరాచకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
నాటి మాటలు మరిచిపోయారా?
తమ పార్టీ తరఫున సెంట్రల్ యూనివర్సిటీకి రావాలని అనేకమంది అడుగుతున్నారని.. విద్యార్థుల ఆందోళనను రాజకీయ చేస్తారనే ఉద్దేశంతో తమ పార్టీ తరఫున ఇప్పటిదాకా నేరుగా పోలేదని కేటీఆర్ చెప్పారు. సరైన వేదికలపైనే ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. పార్లమెంట్ రాజ్యసభలో తమ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో కూడా రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు శ్మశానాలకు కూడా జాగాలు ఉండవని చెప్పింది రేవంత్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు అవన్నీ ఎందుకు మరిచిపోయారని నిలదీశారు. వైస్ చాన్స్‌లర్ అనుమతులు లేకుండా పోలీసులు వెళ్తున్నారని.. విచ్చలవిడిగా పోలీసులను పంపించి విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
స్టూడెంట్స్ ఆచూకీ బయటపెట్టాలి
యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారని.. జైలుకి పంపించారని చెబుతున్నారని.. వారికి తాము అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వాళ్లకి న్యాయపరంగా అన్నిరకాల సహకారం అందిస్తామన్నారు. ఆ ఇద్దరు విద్యార్థుల ఆచూకీని వెంటనే రాష్ట్రప్రభుత్వం బయటపెట్టాలని డీజీపీని కోరారు. ఆడవారని కూడా చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు లాంటి వారు ఈ అంశంలో ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. పిల్లల తరఫున నిలబడేందుకు వారికి ఎందుకు మనసు రావడం లేదన్నారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని.. తొలి దశ ఉద్యమం తర్వాత ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపై, యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్నదని అన్నారు.
వందల బుల్డోజర్లు, యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను, చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఏ విధంగా ఈ 400 ఎకరాలు అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారని.. వాటిని అమ్మేముందు జరిగే పర్యావరణ నష్టంపై అధ్యయనం చేయాలని అడుగుతున్నారని తెలిపారు. 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించిందని.. కేవలం స్టేడియం, క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చిందని చెప్పారు. కానీ.. ఈ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. 21 సంవత్సరాల తర్వాత కేసు తేలిందని.. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే ఆ భూములను అమ్మి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు వేశారు. యూనివర్సిటీ పరిధిలో బుల్డోజర్లు చేస్తున్న కార్యక్రమాలు రాహుల్‌కు కనిపించడం లేదా అని నిలదీశారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై ప్రజా ప్రయోజన రాజ్యం వేయడం జరిగిందని.. హైకోర్టు ఆదేశాల కన్నా ముందే ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నదని, రాహుల్‌గాంధీ స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇదే రాహుల్‌గాంధీ గతంలో ముంబయి ఆరాయి అడవులపైన జాతీయస్థాయిలో మాట్లాడారని.. ఛత్తీస్‌గఢ్‌లో హస్దేయో అడవులను ఇతరులకు కేటాయించకుండా మాట్లాడారని.. హైదరాబాద్ అంశంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. రాజకీయం వలన ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పర్యావరణం, వన్యప్రాణుల రోదనలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.






