యువతతో పెట్టుకుంటే శ్రీలంక గతే... కేంద్రానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

by Gantepaka Srikanth |

నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా, హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

యువతతో పెట్టుకుంటే శ్రీలంక గతే... కేంద్రానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా, హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దేశంలో యువత ఆలోచనల్లో, స్వరంలో మార్పు వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. "మోడీ.. మీరు పెట్టుకోకూడని వారితో పెట్టుకున్నారు. ఈ దేశ యువతరంతో పెట్టుకున్నారు. జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది.. నవతరం మారుతున్నది. ‘రాజ్యమా ఉలికిపడు’ అంటూ యువత గర్జిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గుర్తింపుంచాలి” అని కేటీఆర్ అన్నారు. గతంలో శ్రీలంకలో ఉప్పొంగిన యువతరం అక్కడి ప్రభుత్వాలను ఎలా ఉరికించి పాతరేసిందో గుర్తుచేసిన కేటీఆర్, అలాంటి శక్తివంతమైన యువతరంతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై స్పందించడకుండా కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడటం హేయమైన చర్య అని మండిపడ్డారు. కేంద్రానికి నిజంగా బాధ్యత ఉంటే, ఈపాటికి విద్యార్థుల వద్దకు వెళ్లి అనేకసార్లు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేదన్నారు.

తప్పించుకునే రాజకీయాలు..

సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ.. 12 ఏళ్లలో ఎన్ని భర్తీ చేశారని ప్రవ్నించారు. కేవలం మతం పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈనాటి యువత సీబీఐ, ఈడీ (ED), ఐటీ (IT) దాడులకు భయపడే తరం కాదని మోడీ గ్రహించాలని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల ఉద్యమానికి అండగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామని.. ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని కేటీఆర్ వివరించారు. "విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడి తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీగా.. విద్యార్థులకు అండగా నిలవడం మా బాధ్యత అని చెప్పారు. పార్టీల జెండాలు, ఎజెండాలతో వారి ఉద్యమాన్ని కలుషితం చేయవద్దు, కానీ వారందరికీ మనం అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి అని పిలుపునిచ్చారు.

సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకు మద్దతు..

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాష్టీకాన్ని చూస్తే ఎవరి మనసైనా కరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రధాని, కేంద్రమంత్రుల కుర్చీలు అడగలేదని, కేవలం న్యాయం మాత్రమే అడిగారన్నారు. నీట్ పేపర్ లీకేజ్‌తో పాటు విద్యారంగంలో సంస్కరణల కోసం సోనమ్ నిరసనకు దిగారని, మీడియా మద్దతు లేకున్నా జెన్ జీ (Gen 7) యువత సోషల్ మీడియా వేదికగానే దేశాన్ని కదిలించిందని కొనియాడారు. చివరగా.. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులు, యువతపై పెట్టిన అక్రమ పోలీసు కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులపై జరిపిన దాష్టీకానికి, అక్రమ కేసులకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story