యూరియా కొరతపై కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-08-23 16:53:29  IST  )

హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

యూరియా కొరతపై కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించినందుకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల కోసం పనిచేశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం, అసెంబ్లీలో బిల్ ఆమోదించామని గుర్తు చేసారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం మరో బిల్ తెచ్చామని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన 50% రిజర్వేషన్ పరిమితి చట్టం అడ్డంకిగా మారిందని, దాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ తెచ్చామని, గవర్నర్ దానిని కేంద్రానికి పంపారని వెల్లడించారు. బీసీలకు మేలు జరగాలని, రాహుల్ గాంధీ మాట నిలబడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కేసీఆర్ చట్టం వల్ల బీసీలకు 1% రిజర్వేషన్ కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి 90 రోజుల్లో బిల్లులను ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు.

90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీమ్ కోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని, అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందన్నారు. ఈ నెల 26న బీహార్‌లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రలో పాల్గొంటానని సీఎం పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

కేటీఆర్ యూరియా ఇచ్చే పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తాననడం వారి ద్వంద వైఖరి బయటపడిందని విమర్శించారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశానని తెలిపిన సీఎం... యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలని సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై నలుగురు మంత్రులతో కూడిన కమిటీని వేస్తున్నట్టు పేర్కొన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ లో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Next Story