బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి!.. స్వయంగా ఆహ్వానించిన కేటీఆర్..

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-09 10:33:26  IST  )

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి!.. స్వయంగా ఆహ్వానించిన కేటీఆర్..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని కేటీఆర్ స్వయంగా కలిసి, ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సుమారు గంటకు పైగా సాగిన భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ మార్పుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఎందుకు ఈ మార్పు..?

కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో తన ప్రమేయం లేకుండా జరుగుతున్న నిర్ణయాలు, ప్రభుత్వంలో సీనియర్లకు సరైన గుర్తింపు లభించకపోవడం, స్థానికంగా ఇతర పార్టీల నేతల చేరికలు తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని పట్టున్న జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను పార్టీలోకి తీసుకురావడం ద్వారా, ఆ ప్రాంతంలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. జీవన్ రెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకు సముచిత గౌరవం మరియు బాధ్యతలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌ను వీడి గులాబీ కండువా కప్పుకుంటే, అది అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు.

‘రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం కేసీఆర్ రావాలి’:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Next Story